స్మార్ట్ సిటీపై రవీందర్ సింగ్ ఆరోపణలు  అర్థ రహితం 

స్మార్ట్ సిటీపై రవీందర్ సింగ్ ఆరోపణలు  అర్థ రహితం 
  • బండి సంజయ్ నీ విమర్శిస్తే ఖబడ్దార్
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ స్మార్ట్ సిటీపై రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితం, అవాస్తవమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళకు రమేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు ఎంపీ బండి సంజయ్ కుమార్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని, ఆ పార్టీ నేతలు బండి సంజయ్ కుమార్ పైఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, బిఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని చెప్పారు.

కెసిఆర్ చేయించిన స్వంత సర్వే లోనే విషయం తెలిసిందని, బిఆర్ఎస్ కు ఓటు వేస్తే వృధా అనే భావనలో ప్రజలు ఉన్నారని  అన్నారు. రవీందర్ సింగ్ స్మార్ట్ సిటీ అడ్వైజరి బోర్డులో ఎవరు ఉంటారో తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. అడ్వకేట్ గా, మాజీ మేయర్ గా రవీందర్ సింగ్ కనీస విషయ పరిజ్ఞానం లేకుండా సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బండి సంజయ్ కుమార్ అడ్వైజరి బోర్డులో కేవలం సభ్యుడు మాత్రమేనని, ఈ విషయంలో బండి సంజయ్ కుమార్ పై అవాస్తవాలు మాట్లాడడానికి రవీందర్ సింగ్ కు కనీస పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  కరీంనగర్  విషయంలో సవా లక్ష దొంగహామీలుఇచ్చారన్నారు.

ముఖ్యంగా కెసిఆర్ కరీంనగర్ మార్కెట్ కోసం 33 కోట్లు కేటాయించారని రవీందర్ సింగ్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయనకు దమ్ముంటే ఆ నిధుల వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ మార్కెట్ను 300 కోట్లకు బండి సంజయ్ కుమార్ అమ్మే కుట్ర చేస్తున్నారని రవీందర్ సింగ్ మతిభ్రమించి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రవీందర్ సింగ్ ఓ రాజకీయ నిరుద్యోగి, ఉన్న కార్పొరేషన్ పదవి పోయింది, ఇక్కడి వాళ్ల పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోడు, కార్యకర్తలు పట్టించుకోరు, పొద్దు పోక ఏది పడితే అది మాట్లాడడం నేర్చుకొని, బండి సంజయ్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రవీందర్ సింగ్ అవినీతిపరుడు, చెత్త ఊడ్చే సానిటేషన్ సిబ్బంది దగ్గర కూడ కమిషన్లు తీసుకొనే నీచ గుణ వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. దేశం కోసం ధర్మం కోసం పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ, పార్లమెంటు సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బండి సంజయ్ కుమార్ పై అనవసర విమర్శలు, అసత్య ప్రచారాలు చేస్తే ఆకాశం మీద ఉమ్ము వేసినట్టేననే విషయం రవీందర్ సింగ్ గుర్తుంచుకొని ఇకపై మాట్లాడితే మంచిదన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ బిజెపి పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు. నాయకులు రాజేందర్ రెడ్డి, జాన పట్ల స్వామి, భూపాల శ్రీనివాస్ రమణారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.