చంపేశారు ..!?

చంపేశారు ..!?
  • పోరాడి ఓడిన ప్రీతి 
  • ఐదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స 
  • ఆదివారం రాత్రి కన్నుమూత 
  • శోకసంద్రంలో కుటుంబీకులు , సహచర విద్యార్థులు ,
  • ఎవరిదీ పాపం …?

ముద్ర ప్రతినిధి, వరంగల్ : కోటి ఆశలతో వైద్య విద్యను అభ్యసించిన ప్రీతి ఇకలేరు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె జీవిత పోరాటంలో ఓడిపోయారు. తను చదివే కళాశాలలో ఓ సీనియర్ వేధింపులకు ఆమె బలైంది. న్యాయం చేస్తారనుకున్న వైద్యాధికారులు , పోలీసులు, సీనియర్ విద్యార్థులు ఆమెను అగాథంలోకి నెట్టేశారు. దీంచో తీవ్ర మానసిక వేదనకు గురైన డాక్టర్ ప్రీతి పోలీసులు చెబుతున్నట్టుగా బలవన్మరణానికి పాల్పడి మృత్యు ఒడిలోకి చేరారు. అయితే ఆమె మరణం పై కుటుంబ సభ్యులు బంధువులు , ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ మెడికో సైకో సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. వెంటనే నిందితుడికి ఉరి శిక్ష వేయాలని అతనికి సహకరించిన వైద్యాధికారులను సైతం చట్ట పరంగా శిక్షించాలంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. 

పోరాడి ఓడిన ప్రీతి 

కే ఎం సి లో వైద్య విద్యను అభ్యసిస్తున్న జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ధరావత్ ప్రీతి ఈ నెల 21 న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సీనియర్ విద్యార్థి సైఫ్ అలీ వేధింపుల కారణంగానే ప్రీతి మత్తు మందు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎంజీఎంలో చికిత్స చేస్తున్నప్పటికీ ప్రీతి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి కి తరలించిన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా ఆమెకు వెంటిలేటర్ పై ఏక్మో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకి ఆమె ఆరోగ్యం విషమించడంతో తల్లి తండ్రులు ఆశలు వదులుకున్నారు. ఆమె బతికి క్షేమంగా బయటికి రావాలంటూ తోటి విద్యార్థులు, బంధువులు, స్నేహితులు ఆకాంక్షించారు. కానీ ప్రీతి ఆదివారం రాత్రి 9-10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 

ఎవరిదీ పాపం ..?

వైద్య విద్యార్థి ప్రీతి మృతి పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు , వైద్యాధికారుల పట్టింపులేని తనం , పోలీసు అధికారుల నిర్లక్ష్యం సహచర విద్యార్థుల నిరుత్సాహం వెరసి ఆమె నిండు ప్రాణాలు బలి తీసుకున్నారనే విమర్శలు లేకపోలేదు. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి తల్లితండ్రులతో తన బాధను చెప్పుకుంది. కూతురు బాధను అర్ధం చేసుకున్న తండ్రి వెంటనే వరంగల్ ఏ సి పి కి ఫోన్ చేసి కళాశాలలో పరిస్థితిని వివరించారు. సైఫ్ ని మందలించి తన బిడ్డ జోలికి రాకుండా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఐతే సదరు పోలీసు అధికారి ఆ విషయాన్నీ కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ ఓ డీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రీతి తండ్రి ఆశించిన మేరకు ఫలితం కనబడలేదు. పైగా హెచ్ ఓ డీ అమ్మాయిదే తప్పు అన్నట్లుగా కళాశాలలో ఇలాంటివి సహజమే అంటూ నిర్లక్ష్యం ప్రదర్శించినట్టు తెలిసింది.

దీంతో రెచ్చిపోయిన సైఫ్ ప్రీతిని మరింత ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. అంతే కాకుండా ప్రీతి సహచరులకు ఫోన్ చేసి ఆమె ఎక్కువ చేస్తుంది సహకరించద్దు అంటూ అవహేళనకా మాట్లాడినట్టు తెలిసింది. అయితే పోలీసులు, వైద్యాధికారులు, సహచర విధ్యార్ధుల నుంచి ఎటువంటి సపోర్ట్ దొరకకపోవడంతో ప్రీతి మరింత మనోవేదనకు గురైనట్లు సమాచారం. దీంతో ఆమె తనకు చావే శరణ్యం అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ ఘటనపై విచారణ జరిపిన సీపీ రంగనాథ్ సైఫ్ అలీ వేధింపుల వల్లే ప్రీతి బలవన్మరణానికి పాల్పడిందని ధ్రువీకరించారు. అందుకు కారణమై సైఫ్ ని అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. అయితే ప్రీతి నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబీకులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సైఫ్ అలీ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు పోలీసులు, వైద్యాధికారుల తీరు పై దుమ్మెత్తి పోస్తున్నాయి. అందరూ కలిసి ప్రీతి ని చంపేశారంటూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రీతి మృతి పై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎం జీఎం , కే ఎం సీ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.