యాదాద్రిలో ఆధ్యాత్మ రామాయణ పారాయణం..

యాదాద్రిలో ఆధ్యాత్మ రామాయణ పారాయణం..
  • వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు మహోత్సవం 

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొండపైన గల శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళ వారం నిత్యారాధనల అనంతరం శ్రీ సీతారామచంద్ర  స్వామి వారి వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా శ్రీసీతారామ హనుమాన్ మూలమంత్ర జపములు, దశశాంతి పంచసూక్త పారాయాణాలతో అభిషేకాలు, ఆధ్యాత్మ రామాయణ పారాయణం గావించారు. శ్రీ సీతారామహనుమత్ మూర్తులకు  శతనామార్చనలు చేశారు. మధ్యాహ్నం  శివాలయం యాగ మండపంలో వేదపండితులు, పురోహితులు అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎ. భాస్కర రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ- కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగసిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

సాయంకాలం కార్యక్రమాలు..

మంగళవారం సాయంకాలం శివాలయంలో నిత్యారాధనలు అనంతరం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాత్రి శివాలయం యాగ మండపంలో నిత్యారాధనలలో భాగంగా శ్రీ సీతారామ హనుమాత్ మూర్తులకు సహస్రనామార్చనలు, "శ్రీసీతారామ చంద్రస్వామి వార్ల - ఎదుర్కోలు మహాత్సవం నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల ఎదుర్కోలు మహోత్సవ ప్రత్యేకతలు 

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ పూర్వరంగాముగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలనాడు మిథిలా నగరంలో వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మర్షుల సమక్షంలో జనక మహారాజు ఈ వేడుక నిర్వహించిరి. శ్రీరాముని పక్షమున వశిష్ఠాది మహర్షులు సూర్య వంశ మహారాజుల వైభవాన్ని వివరిస్తూ దశరథ మహారాజు కుమారులుగా శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రఘ్నుల పరిచయంగావిస్తూ సాక్షాత్తు మహావిష్ణువే శ్రీరామునిగా భూలోక మందు అవతరించి లోకాలను ఆనందింప చేసిన తీరును, శ్రీరామచంద్రునికంగాగుణములను ప్రశంసించిరి. శతానందుడు, గౌతమ మహర్షి మొదలగు వారలు సీతమ్మ వైభవాన్ని వివరిస్తూ జనక మహారాజుకు అయోనిజగా సీతమ్మ భూమిలో లభించినదని, అమ్మవారి యొక్క సౌదర్యాతిశయమును, సకలగుణములను ప్రస్తుతించిరి. ఆదర్శ దంపతులైన శ్రీసీతా రాముల ఎదుర్కోలు మహోత్సవం తిలకించిన సమస్త శుభములు కలుగునని ఆర్యోక్తి.