గాయకునిగా మొదలై.. గేయరచయితగా ఎదిగి..

గాయకునిగా మొదలై.. గేయరచయితగా ఎదిగి..
  • ‘సినీ’ కుసుమం కనుకుంట్ల చంద్రబోస్
  • సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానం
  • తాజ్ మహల్ సినిమాతో అరంగేట్రం
  • సినిమాలలో ఇప్పటికీ మూడువేల పైనే ఆయన పాటలు
  • సామాన్య కుటుంబం నుండి వచ్చి..  ఆస్కార్ అవార్డు వరకు ఎదిగి
  • తన ప్రతిభకు వరించిన 40కి పైగా అవార్డులు
  • ఆస్కార్ అవార్డు గ్రహీతకు రేపు స్వగ్రామంలో అభినందన సన్మానసభ

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలమండలంలోని చల్లగరిగకు చెందిన కనుకుంట్ల చంద్రబోస్ ఈ ప్రాంతం నుండి గేయరచయితగా సినీరంగంలో ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానం పదిలపర్చుకున్నాడు.   గ్రామానికి చెందిన చంద్రబోస్ తన చిన్నతనంలో పాటలు పాడుతూ ఉండేవారు. స్వగ్రామంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని స్టేజీలపై పాటలు పాడుతూ గడిపిన అనంతరం హైదరాబాద్ లో బీటెక్ చదివుతూ గేయాలు రాయడం ప్రారంభించాడు. సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' పాటకు ఇటీవలె ఆస్కార్ అవార్డు రావడం ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.  సామాన్య కుటుంబంలో జన్మించినా పట్టువదలని విక్రమార్కుడిలా అనేక కష్టనష్టాలకోర్చి సినీరంగంలో చోటు సంపాదించాడు.

ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగుతూ తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నాడు. కష్టసుఖాలను అనుభవించి, అవమానాలను భరించి, అంచెలంచెలుగా గుర్తింపు పొందుతూ తనకంటూ సినీ పరిశ్రమలో ఓ స్థానం ఉందని నిరూపించుకున్నాడు చంద్రబోస్.  తల్లి, దండ్రుల ప్రోత్సాహం, శ్రీనాథ్ అనే మిత్రుని సహకారంతో తాజ్ మహల్ సినిమాలో ‘మంచుకొండల్లోనా చంద్రమా’ అనే పాటకు మొదటి ఛాన్స్ రావడంతో, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికీ 8వందల పైగా సినిమాల్లో 3వేలకు పైగా పాటలు రాశాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ 40కి పైగా అవార్డులు అందిపుచ్చుకున్నాడు. నాలుగేళ్లు అమెరికాలోని నాటా కు బ్రాండ్అంబాసిడర్ గా పనిచేశాడు. చాలా పాటలకు వివిధ రకాల అవార్డులు పొందాడు చంద్రబోస్.

- కుటుంబ నేపథ్యం.. 

చిట్యాలమండలం చల్లగరిగ గ్రామానికి చెందిన కనుకుంట్ల నర్సయ్య, మధునమ్మ(కీ.శే) దంపతులకు నలుగురు సంతానం కాగా, చిన్న కుమారుడు చంద్రబోస్. తండ్రి ఉపాధ్యాయుడుగా, తల్లి కూలీపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో చంద్రబోస్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే పదవ తరగతి వరకు, హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్,  హైదరాబాద్ లోని రామంతాపూర్ లో పాలిటెక్నిక్ పూర్తి చేసి,  కూకట్ పల్లిలోని జేఎన్టీయులో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న క్రమంలో సినిమాలోకి అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అంచెలంచెలుగా పాటలు రాస్తూ అనేక అవార్డులను చేజిక్కించుకున్నారు. సినీ రంగంలో నృత్య దర్శకురాలు సుచిత్ర పరిచయమైంది. అది ప్రేమగా మారి ఇద్దరూ ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారికి పాప, బాబు సంతానం ఉన్నారు.

- చిన్నప్పటినుండి పాటలంటే ఇష్టం..

చల్లగరిగలో ఇంటిపక్కనే  గ్రంథాలయం ఉండడం కారణంగా మంచి కథల పుస్తకాలను చదవడం ప్రాథమిక విద్య నుండే అలవర్చుకున్నాడు.  ఆ పక్కనే ఉన్న శివాలయంలో ఉదయాన్నే వేసే భక్తిపాటలను వింటూ సంగీతం, సాహిత్యం పట్ల ఓనమాలు నేర్చుకున్నాడు. అనంతరం తల్లి మధునమ్మతో భజనలకు వెళ్తూ పాటల పట్ల శ్రద్ధ కనబర్చుతూ ఇంటర్ స్థాయిలో రాయడం, పాడడం  పట్ల ఆసక్తి కనబర్చుతూ, మరో వైపు చదువులోనూ ఆటంకాలు లేకుండా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.

- మొదటిసారి అవకాశం ఎలా వచ్చిందటే..

హైదరాబాద్ లో ఉంటున్న క్రమంలో అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన శ్రీనాథ్ అనే మిత్రుడు పరిచయం అయ్యాడు. 1995లో కూకట్ పల్లిలో ఇంజనీరింగ్ చదువున్న పరిస్థితులలో తన పాటలను మిత్రుడు శ్రీనాథ్ కు చూపించగా డైరెక్టర్ ముప్పలనేని శివ వద్దకు తీసుకెళ్లాడు. పాటలను చూసిన  డైరెక్టర్ నిర్మాత రామానాయుడుకు పరిచయం చేయించగా మొదటిసారిగా అవకాశం కల్పించారు. వారి సారధ్యంలో ఉన్న తాజ్ మహల్ సినిమాలో ‘మంచుకొండల్లోన చంద్రమా’ అనే పాటను రాయడం  జరిగింది. ఆ తరువాత కొద్ది నెలల వ్యవధిలోనే ధర్మచక్రం సినిమాలో నాలుగు పాటలకు అవకాశం వచ్చింది. అప్పటి నుండి పెళ్లిసందడి, బొంబాయిప్రియుడు తదితర సినిమాల్లో సహా ఇప్పటివరకు 8వందల పైగా సినిమాల్లో 3వేగా పైగా పాటలు రాయడం జరిగింది. 

– నచ్చిన పాటలు.. వచ్చిన అవార్డులు..

ఇప్పటివరకు రాసిన పాటల్లో అనేక పాటలు చంద్రబోస్ కు పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘నా ఆటోగ్రాఫ్’ చిత్రంలో మౌనంగానే ఎదగమని.., ‘నేనున్నాను’లో చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని.., ‘రంగస్థలం’లో ఎంత సక్కంగున్నావే.., ‘నాని’లో పెదవే పలికే మాటాల్లోనే.., ‘నాకు నువ్వు నీకు నేను’లో తెలుగు భాష తీయదనం.., ‘మగధీర’లో పంచదార బొమ్మ.., ‘జై లవకుశ’లో రావణా.., ‘జై చిరంజీవ’లో జైజై గణేశా.., ‘ఝమ్మందినాధం’లో దేశమంటే మతం కాదోయ్..,  ‘మనం’లో కనిపెంచిన మా అమ్మకే.., ‘బడ్జెట్ పద్మనాభం’లో ఎవరేమీ అనుకున్నా.., అనే పాటలు ఇష్టమైనవిగా చంద్రబోస్ చెబుతున్నాడు. ముఖ్యంగా ‘ఆది’ చిత్రంలోని నీ నవ్వుల తెల్లదనాన్ని, ‘నేనున్నాను’లోని చీకటితో వెలుగే చెప్పెను పాటలకు నందిఅవార్డులు అందాయి.   ‘మనం’లో కనిపెంచిన మా అమ్మకే పాటకు ఫిలింఫేర్ తో సహా ఎనిమిది అవార్డులు వచ్చాయి. ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి పాటకు మనశ్విని అవార్డు, దేశం అంటే మట్టికాదోయ్ పాటకు భారతముని అవార్డు, పంచదార బొమ్మ పాటకు ఐదు అవార్డులు వచ్చాయి. 

–  అందివచ్చిన అవకాశాలు..

గేయరచయితగా ప్రత్యేక స్థానం సంపాదించిన క్రమంలో అమెరికాలోని ‘నాట’కు బ్రాండ్అంబాసిడర్ గా నాలుగేళ్లపాటు పని చేశాడు చంద్రబోస్. అతను రాసిన పాటలపై పీహెచ్డీలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందడం జరిగింది. అనేక టీవీ కార్యక్రమాలలో జడ్జీగా పాల్గొంటూ తన స్థానాన్ని మరింత పదిల పరుచుకున్నాడు. అప్పట్లో జీ సరిగమప లో పాల్గొంటూ జడ్జిమెంట్ ఇచ్చాడు. రాష్ర్టాలు మారినా నాడు, నేడు ఎలాంటి తారతమ్య బేధాలు ఎదుర్కోలేదని చంద్రబోస్ చెప్పాడు.

‌‌–ఊరిపై మమకారంతో సహకారం..

పుట్టిన ఊరు, చదివిన స్కూల్ పై మమకారంతో తనవంతు సహకారం అందించాడు చంద్రబోస్. నానమ్మ లక్ష్మీ స్మారకార్థం  చల్లగరిగ హైస్కూల్లో పదవ తరగతి టాపర్లుగా నిలిచిన వారిలో ఫస్ట్ బహుమతిగా రూ.5వేలు, సెకండ్ బహుమతిగా రూ.2,500లు ప్రతి ఏడాది అందజేస్తున్నాడు. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనాలకు తనవంతుగా రూ.1.3లక్షలు అందించాడు. నల్లాలు, ఫ్యాన్లు, గేటు తదితర పనులు చేయించాడు. చల్లగరిగ చుట్టుప్రక్కల గల పదిగ్రామాల ప్రాథమిక పాఠశాలలకు ఫర్నీచర్ చేయించాడు. స్థానిక శివాలయం, రామాలయం ఆలయాలకు తనవంతుగా సహకరిస్తున్నట్లు చంద్రబోస్ తెలిపాడు.

- ఊరు పిలుస్తోంది..
 - ఆస్కార్ అవార్డు గ్రహీతకు రేపు స్వగ్రామంలో అభినందన సన్మానసభ..

'నాటు నాటు' పాటను రాసి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ను చల్లగరిగ పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు ఆహ్వానించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రేపు(ఆదివారం) ఘనంగా సన్మానించేందుకు అభినందన సభను ఏర్పాటు చేస్తున్నారు. పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పూర్వవిద్యార్థులు ఈ సందర్భంగా చంద్రబోస్ ను ఘనంగా సన్మానించనున్నారు.