కృష్ణ నీళ్ల వాటా తేల్చకుండా గాడిదలు కాస్తుండ్రా

కృష్ణ నీళ్ల వాటా తేల్చకుండా గాడిదలు కాస్తుండ్రా
  • జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోని పనికిమాలిన ప్రభుత్వం
  • కాంగ్రెస్ నేతలు వేసిన కేసులను దమ్ముంటే బయటపెట్టుమని కేసీఆర్ కు సవాల్
  • ప్రాజెక్టులను ఆపాలని కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసులు వేయలే
  • ప్రాజెక్టుల పంపుల కొనుగోలులో అవినీతిని అరికట్టాలని కేసు వేసిన నాగం
  • తప్పుడు తీర్పులు ఇచ్చారని అంటున్న  కోర్టులను దమ్ముంటే నిషేధించు
  • ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
  • ల్యాండు, స్యాండు, మైన్స్, వైన్స్ తో పాటు బొందలగడ్డను వదలని బిఆర్ఎస్ నేతలు
  • బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్  ల నిర్మాణం పట్ల ఉన్న శ్రద్ధ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మీద ఎందుకు లేదు
  • ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కి పి ఆర్ ఓ వా?.. ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి పై భట్టి ఫైర్
  • ఐదు నెలల్లో భయం నుంచి తెలంగాణ సమాజాన్ని విముక్తి చేస్తాం
  • వట్టెం ప్రాజెక్టు వద్ద మీడియాతో మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిది, నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంతో తేల్చకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం గాడిదలు కాస్తుందా? అని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండలం వట్టెం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం రోడ్ డ్యామ్ వద్ద  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి వందలసార్లు వెళ్లినప్పటికీ కేంద్రంతో కానీ ట్రిబ్యునల్ తో మాట్లాడి మన వాటా ఎంతో తేల్చలేని పనికిమాలిన ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ విభజనలో రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని పార్లమెంట్ ద్వారా తెచ్చుకున్న చట్టాన్ని సైతం సాధించకుండా పదేళ్లుగా గాడిదలు కాస్తున్నారా? ఎందుకు జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోలేదని సీఎం కేసీఆర్ ను నిలదీశారు. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు జాతీయ హోదాకు అర్హత లేదా? నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులు చట్ట విరుద్ధంగా ఉన్నాయా? లోసుగులతో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నందున  కేసిఆర్ కు కేంద్రాన్ని అడిగే ధైర్యం చేయడం లేదా? ఎందుకు జాతీయ ప్రాజెక్టును తెచ్చుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్యలు  ఇల్లు నిర్మాణం చేసుకుంటేనే ఇంజనీర్ వద్దకు వెళ్లి ప్లాన్ తెచ్చుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో నిర్మాణం చేస్తున్న సాగు నీటి ప్రాజెక్టులన్నిటికీ డిజైన్ చేస్తానంటున్న సీఎం కేసీఆర్ ఏమైనా ఇంజనీర్ చీఫ్ చేశాడా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు కావస్తున్న ఇరిగేషన్ శాఖలో పూర్తిస్థాయిలో ఈఎన్ సీ  నియామకం  చేయకుండా రిటైర్డ్ ఈఎన్ సీ ని కొనసాగించడం వెనక సీఎంకు ఉన్న లాలుచీతనం ఏంటని నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టులో దోపిడీ జరుగుతుంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏమి కావాలని అన్నారు.

రెండోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖకు మంత్రి లేకపోవడం, ప్రధానమైన ఈ శాఖకు పూర్తిస్థాయి  ఈఎన్సీ అధికారి లేకుండా రిటైర్డ్ అధికారిని కొనసాగించడంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. తెలంగాణ వచ్చే దశాబ్ద కాలం అవుతున్న కృష్ణా, గోదావరి నదుల నుంచి ఒక్క ఎకరానికి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా సాగునీరు ఇవ్వలేదన్నారు. కాలేశ్వరం కట్టామని బిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు చెక్ డ్యామ్ ల తరహాలోనే ఉపయోగపడతాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని చెప్పడం పెద్ద అబద్ధమని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు సాగులో ఉందని, 2004 సంవత్సరం నాటికి మరో 35 లక్షల ఎకరాలు సాగులోకి రాగా, జల యజ్ఞం ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను డిజైన్ చేశామన్నారు. 95 లక్షల ఎకరాలకు గత ప్రభుత్వాలు సాగునీరు ఇవ్వడానికి కృషి చేయగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి  ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వని అవినీతి ప్రభుత్వమని మండిపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.

జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీళ్లు పారించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేయగా కెసిఆర్ శ్రీశైలం నుండి నీళ్ళు ఇవ్వడానికి రీ డిజైన్ చేయడంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంచనా వేయం 55 వేల కోట్లకు పెరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి పైపులు, పంపులు కొని నిధులు స్వాహా చేయాలన్న సోయి తప్ప, నీళ్లు అందించాలన్న ఆలోచన లేదని మండిపడ్డారు. కుర్చి వేసుకుని 33 నెలల్లో పూర్తి చేస్తామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 90 నెలలైనా పూర్తి చేయని అసమర్ధత ప్రభుత్వం అన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ప్రాజెక్టులు జాప్యం కావడానికి గల కారణాలను ఈ ప్రభుత్వమే సృష్టించి, నిర్వాసితులు కోర్టుకు వెళ్లే వెసులుబాటు కల్పించి, ప్రాజెక్టులణ నిర్మాణాలను ప్రభుత్వమే జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా 123 జీవో ద్వారా భూములను బలవంతంగా గుంజుకొని గిరిజనులను,  దళితులను, బలహీన వర్గాలను రోడ్డున పడేయడం అమానవీయమని పేర్కొన్నారు. 
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేయడానికి సంబంధిత శాఖ మంత్రి లేకపోవడం, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉన్నప్పటికీ సమీక్ష చేయకపోవడం, కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యంగా కొనసాగుతుందని అన్నారు‌‌. సీఎంఓ కార్యాలయం సెక్రటరీలు ప్రాజెక్టుల వద్దకు హెలికాప్టర్ వేసుకొని వచ్చి సమీక్షలు చేస్తుంటే వారి వెనకాల మంత్రులు పరుగులు పెట్టడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ కు దమ్ముంటే ఏం కేసులు వేశారో బయట పెట్టాలి

సాగునీటి ప్రాజెక్టులను ఆపాలని కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారని అసత్య ప్రసారం చేస్తున్న సీఎం కేసీఆర్,  టిఆర్ఎస్ నాయకులు ఏం కేసులు వేశారో బయట పెట్టాలని సవాల్ చేశారు. 
కేసులు వేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి పాత బిల్లులకు రావలసిన ఆరు లక్షల రూపాయలకు బదులు  26 కోట్ల రూపాయలు ఇచ్చి బిఆర్ఎస్ లో చేర్చుకొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల పై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రాజెక్టులు కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధంగా వెళితే ఏ కోర్టు ఆపదన్న విషయం ఈ ప్రభుత్వానికి తెలియదా? అన్యాయం ఉంటనే కదా ఆపమని కోర్టులు ఆర్డర్లు ఇచ్చేవి అని అన్నారు.  మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ఆపాలని కోర్టులో కేసు వేయలేదని, పంపుల కొనుగోలులో జరిగిన అవినీతిని అరికట్టాలని కేసు వేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. బిహెచ్ఈఎల్ కంపెనీ ద్వారా 1600 కోట్ల రూపాయలకు పంపులు కొనుగోలు చేసి, కాంట్రాక్టర్కు ప్రభుత్వం రూ. 7200 కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించి జరిగిన అవినీతి గురించి కోర్టులో కేసు వేశారని వివరించారు.

ఒక్క ప్రాజెక్టులోనే పంపులు కొనుగోలులో 5600 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి? ఎవరికి ఇచ్చారో ఈనెల 6న నాగర్ కర్నూల్ వస్తున్న సీఎం కేసీఆర్ స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాయాలు జరిగినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలకు వెళ్లి న్యాయం కోరడం జరుగుతుందని, ఆ న్యాయస్థానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు తీర్పులు ఇచ్చారని అనుకునే ఈ పాలకులకు దమ్ముంటే కోర్టులను నిషేధించాలని  సవాల్ చేశారు. ప్రజలకు కావలసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోని బి ఆర్ఎస్ ప్రభుత్వం వారి పార్టీ కి కావలసిన కార్యాలయాలు దేశ రాజధాని ఢిల్లీతో పాటు జిల్లా కేంద్రాల్లో చక చక నిర్మాణం చేసుకున్నారని వివరించారు. టబిఆర్ఎస్ పార్టీ బాగుపై ఉన్న శ్రద్ధ కేసీఆర్ కు ఇండ్లు లేని పేదలు, సాగునీరు లేక అల్లాడుతున్న రైతుల పట్ల ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది కేవలం కల్వకుంట్ల కుటుంబం బిఆర్ఎస్ నాయకులు బాగుపడటానికి కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు.

ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కి పిఆర్ఓవా?  మరి జనార్దన్ రెడ్డి పై   భట్టి ఫైర్

ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రతినిధివా? కాంట్రాక్టర్ కోసం పనిచేసే పి ఆర్ ఓనా? వారికి టెక్నికల్ అసిస్టెంట్ వా? లేక సలహాదారుడివా? వట్టెం ప్రాజెక్టు నిర్మాణానికి చుట్టు పక్కల చెరువుల నుంచి నల్ల మట్టి తరలించుకోపోవడానికి కాంట్రాక్టర్కు లబ్ధి చేయడానికి ఎమ్మెల్యేగా గెలిచావా? అని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్దన్ రెడ్డి పై భట్టి ఫైర్ అయ్యారు. వట్టెం ప్రాజెక్టు నిర్మాణానికి నల్ల మట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలని టెండర్ లీడ్ ఉన్నది ఏంటి? ఎక్కడి నుంచి తీసుకువచ్చి బండు నిర్మాణం చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల చెరువుల్లో జరిగిన మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ చేయాలన్నారు. చెరువుల్లో ఐదు నుంచి పది అడుగుల లోతు వరకు నల్ల మట్టి  కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చిన ఎమ్మెల్యే చెరువులు ఇంకిపోయి ఆయకట్టు ఎండిపోతే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల మట్టి కుంభకోణానికి పాల్పడుతున్న మర్రీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలతో మట్టి జనార్దన్ రెడ్డి గా పిలిపించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ల్యాండు, స్యాండు, మైన్స్, వైన్స్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు బొందల గడ్డను సైతం వదలడం లేదని విమర్శించారు.

రెండుసార్లు గెలిచి నాగర్ కర్నూల్ అభివృద్ధికి ఏం చేశాడని ప్రశ్నించారు. చెన్నై షాపింగ్ మాల్స్ బ్రాంచులు విస్తరించడం పట్ల ఉన్న శ్రద్ధ  మర్రి జనార్దన్ రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధిపై లేదని విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్ర విచారణ జరిపించి దోపిడీకి పాల్పడిన ప్రజా సంపదను కక్కిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ తొత్తులుగా మారి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న అధికారుల లెక్కలు కూడా రాస్తున్నామని చట్టబద్ధంగా వారిపై కూడా చర్యలు ఉంటాయని.  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు ఏంటి? ఇప్పటివరకు మనం సాధించినవి ఏంటి? సాధించకపోవడానికి అడ్డంకిగా ఉన్న కారణాలను చర్చించుకుని అడ్డుగా ఉన్న వారిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భయంగా బతికే రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఐదు నెలల్లో తెలంగాణ సమాజాన్ని విముక్తి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న పోలీసు రాజ్యాన్ని పారద్రోలి సామాజిక తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తుందని వెల్లడించారు.

టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కామెంట్స్

ఈనెల 6న నాగర్ కర్నూల్ కి వస్తున్న సీఎం కేసీఆర్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంబంధించిన ప్రశ్నలపై స్పష్టంగా సమాధానం ఇవ్వాలి.

నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దగా చేసిన విషయంపై సమాధానం చెప్పాలి.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటన్న దానిపై స్పష్టత ఇవ్వాలి.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ పోడు భూములు కనిపించకుండా ఏమైపోయాయి. వీటన్నింటిపై సీఎం కేసీఆర్ స్వేద పత్రం విడుదల చేసి స్పష్టంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న.