టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్! 

టీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్! 

ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  అందుబాటులోకి తీసుకువస్తోంది.  మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి,  చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది.  ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు 'లహరి- అమ్మఒడి అనుభూతి'గా నామకరణం చేసింది.  హైదరాబాద్‌ – విజయవాడ మార్గంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్‌ బస్సుల ప్రారంభోత్సవం జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.