తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం..

తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం..
Tribal, Women and Child Welfare Minister Satyavati Rathore
  • రాష్ట్రంలో మొదటిసారి మదర్ అండ్ చైల్డ్  ఫ్రెండ్లీ రూమ్ ఏర్పాటు
  • జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను అభినందించిన మంత్రి
  • రాష్ట్ర,జిల్లా ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు: మంత్రి సత్యవతి రాథోడ్
  • టౌన్ పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్  ఫ్రెండ్లీ రూమ్ ను ప్రారంబించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గిరిజ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ గారు  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే అభివృద్ధితో పాటు పోలీస్​ వ్యవస్థ ఆధునీకరణపై  దృష్టి సారించార‌ని, ఆయన దిశ‌నిర్ధేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. మహబూబాబాద్ లో శనివారం రోజు టౌన్ పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఫిర్యాదులు చేయడానికి, దోషులను కలవడానికి, పోలీస్ స్టేషన్ కు చిన్నారులతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడకుండా ఈ ప్రత్యేక రూమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. పిల్లలకు  పోలీస్ స్టేషన్ అనే భావన కలగకుండా ఆడుకోవడానికి, చిన్నారులు నిద్రించడానికి ఈ ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఫిర్యాదుల కోసం పౌరులు స్వేచ్ఛగా పోలీసులను ఆశ్రయిస్తున్నారని స్పష్టం చేశారు. మహిళల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ గదిని మరియు మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయడం వల్ల మహిళలు వారి సమస్యలను ఎటువంటి సంకోచం లేకుండా వచ్చి చెప్పే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్ లను  సఖి సెంటర్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీస్ వ్యవస్థ మొత్తం చీకటిలో ఉండేదని, అరకొర జీతాలతో, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులతో ఉన్నదని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత  ముఖ్యమంత్రి కేసీఆర్  పోలీసులకు ఎక్స్ గ్రేషియా పెంచడంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీలను అందించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా హోంగార్డుల జీతాలను కూడా పెంచి.. వారి గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడారని అన్నారు.