ప్రభుత్వానికి గవర్నర్ షాక్​

ప్రభుత్వానికి గవర్నర్ షాక్​

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తమిళిసై
గవర్నర్ కోటా కింద దాసోజు, కుర్రా అభ్యర్థిత్వాల సిఫార్సు 
వీరిద్దరూ సామాజిక సేవలో పాల్గొన్నట్లు 
ఆధారాలు లేవన్న ప్రథమ పౌరురాలు
వీరిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కుదరదంటూ స్పష్టం  

ముద్ర, తెలంగాణ బ్యూరో : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.  దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె వెనక్కి పంపారు. వీరిద్దరూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని,  సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు ఎక్కడా లేవని ఆమె స్పష్టం చేశారు. గవర్నర్ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో ఆమె వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

 తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన  కుర్రా సత్యనారాయణను ఎస్టీ కోటా కింద,  బీసీ కోటా నుంచి దాసోజు శ్రవణ్ కుమార్ కు అవకాశం ఇవ్వాలని ఈ యేడాది జూలై 31 రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించి గవర్నర్ కు సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని మాత్రమే సిఫార్సు చేయాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి మరోసారి సూచించారు.