అమరుల త్యాగాలు అనిర్వచనీయం: కలెక్టర్ వరుణ్ రెడ్డి

అమరుల త్యాగాలు అనిర్వచనీయం: కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలు అనిర్వచనీయమైనవని కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నూతన కలెక్టరేట్ భవనంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా అమరవీరుల స్థూపానికి జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి,ముధోల్ శాసన సభ్యులు విఠల్ రెడ్డి లు జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులుర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ముగ్గురు అమరవీరులు ఉన్నారని వారు చిన్న నరసయ్య, శైలేందర్, గంగాధర్ లని పేర్కొన్నారు. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం అమరులయ్యారని, వారి కుటుంబ సభ్యులను ఎంత ఓదార్చిన వారికి జరిగిన నష్టం పూర్చలేనిదని, వారు కూడా వారి మాటల్లో వారి ఆవేదనను చెప్పలేకపోతున్నారని అన్నారు. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటామని అన్నారు.

ఆంధ్ర రాష్ట్రం తో తెలంగాణ రాష్ట్రాన్ని 1956లో విలీనం చేసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పరిచారని అప్పటినుండే పలు దశలలో ఉద్యమాలు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగాయని ముల్కీ ఉద్యమం ఇలా పలు రకాల పేర్లతో ఉద్యమాలు జరిగాయన్నారు. చివరికి తెలంగాణ ను సాధించుకున్నామని అన్నారు. శాసన సభ్యులు విఠల్ రెడ్డి మాట్లాడుతూ 2014లో తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషించిన కేసీఆర్, జయశంకర్, ఇంకా చాలామంది నాయకులు నిస్వార్థమైన ఎజెండాతో ముందుకు వెళ్లడం వలన తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు కాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు చివరిరోజని తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకి కలిగిన తీరని శోకానికి వారికి నివాళులర్పించడం తెలంగాణలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలను సన్మానించారు ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.