లోపాలను సరి చేసేదే నిజమైన స్నేహం: డా.హిప్నో పద్మాకమలాకర్ 

లోపాలను సరి చేసేదే నిజమైన స్నేహం:  డా.హిప్నో పద్మాకమలాకర్ 

ముషీరాబాద్, ముద్ర: లోపాలను సరి చేసేదే నిజమైన స్నేహమని డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ డైరెక్టర్ డా.హిప్నోపద్మా కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ముషీరాబాద్ ప్రభుత్వ బాలికల హాస్టల్లో డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు పోషకాహారం, కథలు, పాటలు, గొప్ప వ్యక్తుల పుస్తకాలు, పెన్సిల్, ఎరేజర్లు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిప్నోపద్మాకమలాకర్ మాట్లాడుతూ స్నేహం  మానవ సంబంధాల  నిజమైన రూపమని తెలిపారు. ఏమైంది అని అడిగేవారు, ఏమి కాదులే అని చెప్పే వారు స్నేహితులన్నారు. 

కులం, మతం, రంగు, వయస్సు, జాతితో సంబంధం లేకుండా స్నేహాన్ని పెంచుకోవడం ఈ రోజు ప్రాముఖ్యత అని అన్నారు. స్నేహం కోసం ఇతరుల పట్ల దయ, సద్భావనతో, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, అభినందనలు ఇవ్వడం కృతజ్ఞతలు తెలియజేయడం వంటివి చేయాలని కోరారు. అందమైన స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పారు. మన ప్రతి అడుగును  విశ్వసించగలిగే వ్యక్తే స్నేహితులన్నారు. క్లాసులోనూ, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే స్నేహితులనుకోకూడదన్నారు. మంచి సోదరిగా, సోదరుడిగా, కుమార్తెగా, కొడుకుగా కుటుంబం లోనూ స్నేహ సంబంధాలు ఏర్పరుచుకోవాలని తెలిపారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పటికీ విడిచిపెట్టని వారే నిజమైన స్నేహితులని తెలిపారు. స్నేహితులనే వారు పెన్సిల్, ఎరేజర్ లా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో నవభారత లయన్స్ క్లబ్ జోనల్ చైర్ పర్సన్ సి.హెచ్.గోపాలకృష్ణ, జి.హిమకర్, సైకాలజిస్ట్ నితీష్ , హాస్టల్ హెడ్ బాపు ప్రియ పాల్గొన్నారు.