రక్త దానం ఎంతో గొప్పది

రక్త దానం ఎంతో గొప్పది

ముద్ర ప్రతినిధి, మెదక్: అన్ని దానాలలో రక్త దానం ఎంతో గొప్పదని శ్రీ సత్య సాయి సేవా సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ శ్రీవాండ్ల సాయి బాబా అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని సత్య సాయి మందిరంలో ముక్క సుశీలమ్మ, కృష్ణమూర్తి  స్మారక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం విషయంలో ఆపోహాలు  అవసరం లేదని ఆరోగ్యంగా ఉన్న వారు ఎవరైనా రక్త దానం చేయొచ్చన్నారు. ఆనారోగ్యంతో ఉన్న, ప్రమాదాల్లో గాయపడి తీవ్ర రక్త స్రావం అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్త దానం దోహద పడుతుందన్నారు.

అందువల్ల అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ పండిత్ రావ్ మాట్లాడుతూ ముక్క సుశీలమ్మ, కృష్ణ మూర్తి స్మారకర్థం కుమారుడు ముక్క సుధాకర్  స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలుగా సేవ కార్య క్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇంటర్ మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్ధులకు, చదువుతో పాటు, క్రీడలు, సంస్కృతిక అంశాల్లో ప్రావీణ్యం సాధించిన సరస్వతి శిషి మందిర్ విద్యార్థికి డైట్ ప్రిన్స్ పాల్ రమేష్ బాబు చేతుల మీదుగా బంగారు పతకాలు ప్రధానం చేశారు. అలాగే ప్రభుత్వ బాలికల పాఠశాల, సరస్వతి శిశు మందిర్, బాల వికాస్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.