నాడు తాగునీరు సాగునీరు విద్యుత్ సమస్యల వలయంలో తుంగతుర్తి

నాడు తాగునీరు సాగునీరు విద్యుత్ సమస్యల వలయంలో తుంగతుర్తి
  • నేడు తాగు సాగు విద్యుత్ రంగాల్లో అగ్రగామి తుంగతుర్తి
  • పది పైసలు ఇస్తేనే మంచినీరు లేదంటే పావలా టీ తాగి తేనే గ్లాసు నీరు
  • నాడు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య వచ్చినా తుంగతుర్తి లోనే కరెంట్ కట్
  • నేడు విద్యుత్ సమస్య కానరానీ తుంగతుర్తి నియోజకవర్గం.
  • నాడు తుంగతుర్తి నుండి వేలాది మంది కూలీల వలసలు.
  • నేడు తుంగతుర్తికి వందలాదిగా ఇతర రాష్ట్రాలకు కూలీల రాక.
  • నాడు తుంగతుర్తి లో వందల ఎకరాల సాగు పండిన వందల క్వింటాళ్ల వరి ధాన్యం.
  • నేడు వేలాది ఎకరాల సాగు లక్షలాది క్వింటాళ్ల వరి ధాన్యం.
  • నాడు ఉమ్మడి జిల్లాలో తుంగతుర్తి లో కరువు కరాల నృత్యం.
  • నేను నేడు ఉమ్మడి జిల్లాలోకరువు కానరాని తుంగతుర్తి నియోజకవర్గం.

తుంగతుర్తి ముద్ర:-అనాదిగా అతివృష్టి అనావృష్టిలతో కరువుకరాల నృత్యం చేసే తుంగతుర్తి నియోజకవర్గ వ్యవసాయ రంగం నేడు ఎస్సారెస్పీ కాలువల ద్వారా గత నాలుగైదు సంవత్సరాలుగా గోదావరి జలాల రాకతో వ్యవసాయ రంగం స్థిరత్వం పొంది ప్రతి ఏడూ మూడు పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి . గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కంచెలు, కంపచెట్లు, బిళ్ళతో నిండిన వ్యవసాయ భూములు దర్శనమిచ్చేవి .నేడు అవి మాయమై పంట పొలాలతో కళకళలాడుతున్న పచ్చని పైర్లు దర్శనమిస్తున్నాయి. వందల ఎకరాల సాగు భూమి నేడు వేల ఎకరాల సాగు భూమిగా మారింది .వందల క్వింటాళ్ల ధాన్యం నుండి లక్షల క్వింటాల ధాన్యం పండుతుంది. నాడు రైతులకు పెట్టుబడులే రాని వ్యవసాయం నేడు కూడు ,గూడు, గుడ్డ ,కంటి నిండా నిద్ర ను ఇస్తోంది. నాడు నెర్రెలు బాసి ఎండిపోయిన నేల అలాగే నీళ్లు లేక ఎండిపోయి కనీసం మూగజీవాలు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని ఖాళీ చెరువులతో గ్రామాలు కళావిహీనంగా కానవచ్చేవి.  కానీ నేడు అన్ని కాలాల్లో అన్ని ఋతువుల్లో అలుగులు పోస్తున్న చెరువులు కుంటలతో గ్రామ సీమలు జలకలతో కలకలలాడుతున్నాయి .

నిండిన చెరువుల  అలుగుల శబ్దాలు అనునిత్యం గ్రామాల  పొలిమేర వినిపిస్తున్నాయి. గత ఐదారు సంవత్సరాల కాలంగా తుంగతుర్తి వ్యవసాయ రంగం ఉమ్మడి జిల్లాలో అగ్రస్థానంలో ఉండవచ్చని రైతుల మాట .గతంలో రాష్ట్రంలో అత్యంత దయనీయమైన నియోజకవర్గం కరువు కాటకాలు కరాల నృత్యం చేస్తూ ప్రభుత్వ ప్రకటించే కరువు జాబితాలో మొదటి స్థానంలో కనిపించే పేరు తుంగతుర్తిదే .కూలీల వలసలకు మొదటి పేరుగా నిలిచే  నియోజకవర్గం నేడు అభివృద్ధిలో వ్యవసాయ రంగంలో అగ్రస్థానంలో కానవస్తుంది .ఇతర రాష్ట్రాల కూలీలు వ్యవసాయ పనులకు వందల సంఖ్యలో తుంగతుర్తి ప్రాంతానికి వస్తున్నారంటే వ్యవసాయ రంగం లో తుంగతుర్తి స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు .ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు నడిపించే ప్రధాన రంగం విద్యుత్ రంగం ,గతంలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్ తో మోటార్లు కాలిపోయి లోవోల్టేజీ సమస్యతో వేసిన వరి నాట్లు తదితర వ్యవసాయ పంటలు ఎండిపోయి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రధానంగా రాత్రిళ్ళు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ప్రాణాలు సైతం కోల్పోయిన రైతులు ఎందరో. కానీ నేడు చాలినంత విద్యుత్ సరఫరా తో అవసరమైన నీరు పొలాలకు అందుతుంది .24 గంటల విద్యుత్తు వద్దని రైతులు సైతం మొరపెట్టుకున్నారు.

ప్రస్తుతం వ్యవసాయ రంగానికి రెప్పపాటు కాలం కూడా విద్యుత్ సరఫరా ఆగిపోవడం లేదు. గతంలో తుంగతుర్తి నియోజకవర్గం విద్యుత్ రంగంలో బ్లాక్ లిస్టులో కొనసాగి రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కొరత ఉన్న మొదట నియోజకవర్గం కరెంట్ కట్ చేసేవారు. నాటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా విద్యుత్ సమస్య పరిష్కరించలేదు. నేడు ఏమాత్రం అంతరాయం లేని విద్యుత్ సరఫరా అవుతుంది. తుంగతుర్తి నియోజకవర్గ వ్యవసాయ రంగం ఇలా ఉంటే గతంలో గ్రామాల్లో తాగునీటి సమస్యల్లో మొదటి స్థానం తుంగతుర్తిదే .పది పైసలకు గ్లాసు నీళ్లు లేదా హోటల్ లో టీ తాగితే మంచినీళ్లు ఇచ్చే స్థాయిలో మంచినీటి సమస్య ఉన్న తుంగతుర్తి ప్రాంతంలో నేతలు ఎందరు మారిన నియోజకవర్గం తలరాత మాత్రం అలాగే ఉండేదని ప్రజలు అంటుండేవారు .గ్రామాల్లో మంచినీటి తగాదాలు రోడ్లపై ఖాళీ బిందెల ధర్నాలు వ్యవసాయ బావుల వద్దకు లైను కట్టిన ప్రజల వార్తలతో అనునిత్యం తాగునీటి సమస్యలే పత్రికల్లో వార్తల్లో కాన వచ్చేవి .కానీ నేడు మిషన్ భగీరథ పుణ్యమో అలాగే చెరువులు కుంటలు చాలినన్ని నీటితో నిండి ఉండడమో ఏకా ఎక్కిన భూగర్భ జలాలు పెరిగి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట తాగునీరు లభ్యమవుతుంది .ఎక్కడ ఏ గ్రామంలో తాగునీటి ధర్నాలు ఖాళీ బిందెలు చప్పుళ్ళు లేవు .గడచిన నాలుగైదు సంవత్సరాలుగా ప్రజలు తాగునీటి సమస్య మరిచిపోయారు .

తుంగతుర్తి నియోజకవర్గంలోనే అత్యంత ప్రధాన సమస్యలైన సాగు, తాగు ,విద్యుత్ ,సమస్యలు నూటికి నూరు శాతం పరిష్కారం అయ్యాయని ఘంటా పదంగాచెప్పవచ్చు .ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగిన అభివృద్ధి .ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాక తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రధాన సమస్యలు కనిపించకుండా పోయిన మాట యదార్థం. ఎవరెన్ని విమర్శలు చేసినా పైన పేర్కొన్న తాగు సాగు విద్యుత్ సమస్యలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలా ఉండేవో నేడు ఎలా ఉన్నాయో ప్రజల నుండి విమర్శలు చేస్తున్న వారందరికీ తెలుసు. ఈ మూడు సమస్యల బారిన పడని వ్యక్తి లేడు .కాగా నేడు తాగు సాగు విద్యుత్ సమస్యలు లేని నియోజకవర్గంగా తుంగతుర్తిని పరిగణించవచ్చు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నేతలకు స్పష్టంగా వ్యత్యాసం కానవస్తుంది .ప్రజలకు ఇప్పటికే గతానికి నేటికి తేడా కనిపించిందనేది వస్తున్న ఫలితాలు చెబుతున్నాయి .తుంగతుర్తి మరింత అభివృద్ధి చెంది ఇంకా అపరిస్కృత సమస్యలు పరిష్కరించబడాలని కోరుకుందాం.