24 గంటల కరెంట్‌ పేరుతో మోసం

24 గంటల కరెంట్‌ పేరుతో మోసం
  • మంత్రి దయాకర్‌‌రావు గతాన్ని మర్చిపోవద్దు
  • ఉచిత విద్యుత్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా?
  • కాంగ్రెస్‌ జిల్లా నేత అల్లం ప్రదీప్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: 24 గంటల ఉచిత కరెంట్‌ పేరు కేసీఆర్‌‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు అల్లం ప్రదీప్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన జనగామలో విలేకరులతో మాట్లాడుతూ 24 గంటల కరెంట్‌పై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నాయకులు తప్పదోవ పట్టించారని మండిపడ్డారు. ప్రభుత్వం నిజంగా 24 గంటలు కరెంట్ ఇస్తే విద్యుత్ శాఖలో ఉన్న లాక్‌ బుక్‌ రికార్డులను ఎందుకు చూపడం లేదని, వాటిని ఎందుకు మార్చిందని ప్రశ్నించారు. విద్యుత్‌ సంస్థలను భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు. ఇక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అవాకులు చెవాకులు పలుకుతున్న  స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు ఓ సారి తన గతాన్ని గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. అప్పట్లో టీడీపీ హయాంలో చంద్రబాబుకు.. ఇప్పడు కేసీఆర్‌‌కు తొత్తుగా పని చేస్తున్నాడని ఆరోపించారు. మంత్రితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యలకు నిజంగా దమ్ముంటే 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్‌ లీడర్లు ప్రతిపక్షాలపై ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌‌ఎస్‌ చేపడుతున్న ఆందోళనలో రైతులు లేరని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా సెక్రటరీ రాపోలు రామ్మూర్తి, పాలకుర్తి నియోజకవర్గ నాయకులు కోడూరు మురళీధర్‌‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ కూస భాస్కర్‌‌రెడ్డి  పాల్గొన్నారు.