ప్రతి రైతును ఆదకుంటాం

ప్రతి రైతును ఆదకుంటాం
  • నష్టపోయిన వారందరికీ పరిహారం అందిస్తాం
  •  కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌‌రావు

ముద్ర ప్రతినిధి, జనగామ: వడగళ్ల వానలతో నష్టిపోయిన రైతులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు హామీ ఇచ్చారు. అకాల వర్షాలు, పంట నష్టం, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాలపై శనివారం జనగామ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, కలెక్టర్‌‌ శివలింగయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దెబ్బ తిన్న పంటల నష్టాలను వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ విషయంలో ఎవరు కూడా అలసత్వ ప్రదర్శించవద్దన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని సూచించారు.

అలాతే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మక్కల కొనుగోలుకు కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలో వడగండ్ల వానతో  44,166 ఎకరాల్లో వరి, 3,297 ఎకరాల మామిడి, 430 ఎకరాల మొక్కజొన్న, 93 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం జరిగినట్లు తెలిపారు.  జిల్లాలో 19  ఇండ్లు కూలినట్లు అంచనా వేసినట్లు చెప్పారు. వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేందుకు కృషి చేస్తామని, కౌలు రైతు కూడా సమానంగా నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామిరెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, డీఏవో వినోద్ కుమార్, సీపీవో ఇస్మాయిల్, డీఎస్‌వో ఎం.రోజారాణి, డీఎం సంధ్యారాణి పాల్గొన్నారు.