చిరుధాన్యాల విశిష్టతను వివరించాలి

చిరుధాన్యాల విశిష్టతను వివరించాలి

జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య
ముద్ర ప్రతినిధి, జనగామ:  చిరుధాన్యాల విశిష్టతను ప్రతి ఒక్కరికీ వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనగామ కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య అన్నారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో పోషణ అభియాన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా చిరు ధాన్యాలపై ప్రదర్శన, వంటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌‌తో పాటు అదనపు కలెక్టర్ ప్రపుల్‌ దేశాశ్‌ హాజరై మాట్లాడారు. ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా వివిధ దేశాలతో పాటు మన దేశం కూడా ప్రకటించిందని చెప్పారు. చిరుధాన్యాల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి  ఎంతో -మంచిదన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ చిరుధాన్యాలతో కలిగే లాభాలను వివరించడమే పోషణ పక్షం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశాల ద్వారా గ్రామగ్రామాన పోషణ, ఆరోగ్యంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డిఓ మధుమోహన్, జిల్లా రూరల్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ రామ్ రెడ్డి,  ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ ఈడీ వెంకన్న, ఆగ్రికల్చర్ ఆఫీసర్ వినోద్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ సుగుణాకర్, తహసీల్దార్‌‌ రవీందర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు చిరుధాన్యాల స్ట్రాల్స్‌ను సందర్శించడంతో పాటు చేసిన వంటకాలను రుచి చూశారు. బెస్ట్ వంట చేసిన వారికి బహుమతులు అందజేశారు.