కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ట్రైలర్ మాత్రమే..

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ట్రైలర్ మాత్రమే..
  • అసలు సినిమా తెరపైకి తెస్తే కేసీఆర్ ప్రచారంలో ఉండడం అనుమానమే..
  • కాంగ్రెస్ గ్యారంటీలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర..
  • సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా కాంగ్రెస్ అడుగులు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కేసిఆర్ చీకట్లోకి వెళ్ళి మేదో మధనం చేస్తున్నాడని... బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తే..  కాంగ్రెస్ తీసుకొచ్చిన 6 ఆరు గ్యారంటీలను సీఎం కేసీఆర్ ఆమోదించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కేసీఆర్ రాజముద్ర వేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కరికైనా ఒక గుంట జాగా ఇచ్చారా .... జగిత్యాలలో కాంగ్రెస్ పాలనలో సేకరించిన భూమిలోనే నేడు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని అన్నారు. ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఇల్లు నిర్మించడం కాంగ్రెస్ ఆలోచన విధానం.

దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన నిరుద్యోగ, యువత, ఉద్యోగస్తుల గురించి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒక్క మాటా అయినా చెప్పారా.. జాబ్ క్యాలెండర్ ప్రకటించారా.. నిరుద్యోగ భృతిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మంత్రి కేటీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులు ఓపీఎస్ కావాలని ఉద్యమిస్తుంటే పదేళ్ల నుండి నిద్రపోయి ఇప్పుడు పరిశీలించటానికి కమిటీ వేస్తారట.. అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రల్లో ఓపీఎస్ పునఃరుద్ధరిస్తామని చెప్పి, కార్యచరణసైతం ప్రారంభించామని అన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా కాంగ్రెస్ కృషి చేస్తుందని అన్నారు. రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఘుగర్ ఫ్యాక్టరీ మూత పడడానికి కారణం ఏమిటీ.. పసుపు రైతులకు ఏవిధంగా గిట్టుబాటు ధర కల్పించాలి..

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానం. గిట్టుబాటు ధర రూ.15000 ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలో 20న రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి తెలిపారు. తెలంగాణలో నూరుశాతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి, ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి. విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, బండ శంకర్, గాజుల రేజెంధర్, కల్లపల్లి దుర్గయ్య, టిపీసీసీ ఎన్ ఆర్ ఐ సెల్ కన్వినర్ చాంద్ పాషా, పుప్పాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.