దేశం జుక్కల్‌ వైపు చూసేలా అభివృద్ధి చేస్తా 

దేశం జుక్కల్‌ వైపు చూసేలా అభివృద్ధి చేస్తా 
  • ఆరు గ్యారెంటీలు అమలు, డిక్లరేషన్లకు పెద్దపీట
  • పోడు భూముల పంపిణీకి ప్రత్యేక చర్యలు
  • జుక్కల్‌ ఎన్నికల ప్రచారంలో జోరుగా కాంగ్రెస్‌ ప్రచారం
  • నిరుద్యోగ యువత నిరాశపడొద్దని సూచన
  • పెత్తందారీ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు
  • కాంగ్రెస్ జుక్కల్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు

పిట్లం, ముద్ర: దేశం జుక్కల్‌ వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని, ఆరు గ్యారెంటీలు అమలు, డిక్లరేషన్లకు పెద్దపీట వేస్తామని,పోడు భూముల పంపిణీకి ప్రత్యేక చర్యలు, నిరుద్యోగ యువత నిరాశపడొద్దని, పెత్తందారీ పాలనకు చరమగీతం పాడాలంటూ జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్ధి తోట లక్ష్మీ కాంత్ రావు పిలుపునిచ్చారు.  జుక్కల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగామంగళవారం నాడు నిజాంసాగర్ మండలంలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్‌ హామీల్ని లక్ష్మీకాంతరావు ప్రజలకు వివరించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని లక్ష్మీకాంతరావు అన్నారు. డిక్లరేషన్లలో ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి ఉంటామని, తూచా తప్పకుండా ప్రజలకు మేలు జరిగేలా చర్యలు చేపడుతామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500 చెల్లిస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రౌతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని లక్ష్మీకాంతరావు ప్రచారంలో ప్రజలకు వివరించారు. వరి పంటకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ ఇస్తామని అన్నారు. 


గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని లక్ష్మీకాంతరావు చెప్పారు. ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు 250 చదరపు గజాల స్థలం కేటాయిస్తామని చెప్పారు. యువ వికాసం పథకం ద్వారా తెలంగాణలోని విద్యార్థులకు రూ.5 లక్షల విలువ చేసే విద్యా భరోసా కార్డు అందిస్తామని వివరించారు. ప్రతీ మండలంలోనూ ఇంటర్నేషనల్ స్కూళ్లు ఓపెన్‌ చేస్తామని తెలిపారు. అలాగే చేయూత పథకం ద్వారా అర్హులైన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పింఛన్‌ అందిస్తామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ  బీమా ద్వారా 10 లక్షల బీమా కల్పిస్తామని లక్ష్మీకాంతరావు ప్రచారంలో ప్రజలకు వివరించారు. గిరిజనులకు పోడు భూములు పంపిణీ చేస్తామని తెలిపారు. 


బీఆర్‌ఎస్‌ పాలనలో జుక్కల్‌ అభివృద్ధికి నోచుకోలేదని లక్ష్మీకాంతరావు మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ పెత్తందారీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. మళ్లీ అధికారంలోకి రావడానికి బీఆర్‌ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సేనని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని అన్నారు. యావత్‌ దేశమే జుక్కల్‌ వైపు తిరిగి చూసేలా అభివృద్ధి నమూనా అమలు చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ మాయమాటలు ప్రజలు నమ్మొద్దని లక్ష్మీకాంతరావు పిలుపునిచ్చారు. 

నిరుద్యోగ యువత నిరాశకు గురికావొద్దని లక్ష్మీకాంతరావు ప్రచారంలో యువతకు సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. కానీ.. నిరుద్యోగుల్ని కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. యువత అందరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, 10 మందినీ చైతన్యపర్చాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువత తల్చుకుంటే... కేసీఆర్‌ను గద్దె దింపగలరని లక్ష్మీకాంతరావు అన్నారు.