మండుతున్న ఎండలు

మండుతున్న ఎండలు
  • ఉదయం నుండి వడ గాలులు.. ఎండలు ప్రారంబం
  • రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • అడుగు బయట పెట్టాలంటే జంకుతున్న జనం
  • మధ్యాహ్నం వేల కర్ఫ్యూను తలపిస్తున్న రహదారులు
  • ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు 

ముద్ర న్యూస్, కాటారం: రోహిణి కార్తెలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.ఉదయం నుండే ఎండ తీవ్రత పెరుగుతుంది.సాయంత్రం ఆరు దాటినా.. వాతావరణం చల్లబడడం లేదు.పగటిపూట ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే జనం బెంబేలెత్తుతున్నారు.గత వారం రోజులుగా ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.మే,జూన్ నెలలో 15 రోజులుగా అత్యధికంగా 45.7 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా జిల్లా నిప్పుల కొలిమిగా మారుతోంది. రోజురోజుకు బానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. తెల్లవారిందే మొదలు వడగాల్పులు ప్రారంభమవుతున్నాయి.వారం రోజుల కిందటి వరకు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసి చల్లబడిన వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి భగ్గుమంటోంది.ప్రస్తుత పరిస్థితుల్లో తెల్లవారుజామున సూర్యోదయం అయ్యిందో లేదో సూర్యుడి భగభగలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.ఉదయం నుండి అడుగు బయట పెట్టాలన్న జిల్లాలో జనం జంకుతున్నారు.

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత
జిల్లాలో గత వారం రోజులుగా వాతావరణం వేడెక్కడంతో రాత్రి,పగలనకా ఉక్క పోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  తీవ్రమైన వడగాలులు లేదా విపరీతమైన ఉక్కపోత భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొనడంతో జిల్లాలో జనం ఆందోళన చెందుతున్నారు. కరెంటు ఏమాత్రం  సరఫరాలో అంతరాయం ఏర్పడిన చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.విద్యుత్ శాఖ ఆఫీసులకు ఫోన్లు చేస్తూ కరెంటు సౌకర్యం మెరుగుపరచాలని కోరుతున్నారు.ఎండవేడి నుండి ఉపశమనం పొందేందుకు ఏసీలు కూలర్లు ఉపయోగం భారీగా పెరిగింది.దీంతో సామాన్యుడి బడ్జెట్ గురించి కరెంటు బిల్లుల మోత మోగుతోంది.మరోవైపు ఉక్కపోతతో ఒంట్లోంచి నీరు అంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో పలువురు డిహైడ్రేషన్ బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నట్టు పలువురు చెబుతున్నారు.మరోవైపు ఎండ దాటికి మనుషులే గాక పశుపక్షాదులు సైతం విలవిలలాడిపోతున్నాయి.

బయటకు వెళ్లేందుకు జనం వెనకడుగు వేస్తూ ఉండడంతో మధ్యాహ్నం సమయాల్లో రోడ్లన్నీ కర్ఫ్యూ నూ తలపిస్తున్నాయి.కార్లు, ఆటోలు,ద్విచక్ర వాహనాల లాంటి వాటిని చెట్ల నీడలో నిలిపేందుకు వాహనదారులు పోటీపడుతున్నారు.దీంతో పట్టణాల్లోని ఆయా కాలనీలో ఏ చెట్టు కింద చూసిన వాహనాలే దర్శనమిస్తున్నాయి. ఉక్కపోత పెరిగిపోతుండటం భారీ ఎండ వేడిమి పెరగడంతో బానుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూల్డ్రింక్స్ దుకాణాలు,జ్యూస్ సెంటర్లు,సోడా బండ్ల వద్ద జనాల రద్దీ కనిపిస్తోంది. వ్యవసాయ కూలీలు,గృహ నిర్మాణాల్లో పనిచేసే కూలీలు ఇతరత్రా పనులు చేస్తున్న కూలీలు ఉదయం,సాయంత్రం మాత్రమే పనులు చేసి మధ్యాహ్నం సేద తీరుతున్నారు. చాలామంది కూలీలు ఎండలకు భయపడి పనులు చేయకుండా ఇంట్లోనే నివసిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.ఉదయం 11 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.దీంతో జనాలు రాక వీధి వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్వీయ రక్షణే శ్రీరామరక్ష
ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారుసూచిస్తున్నారు.ఏమాత్రం నీరసంగా అనిపించిన వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.

మోగుతున్న ప్రమాదగంటికలు
వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఎండ తీవ్రతల ఆధారంగా ప్రమాదకరస్థాయిని అంచనా వేస్తారు.వేసవిలో 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైతే దానిని సాధారణంగా పరిగణిస్తారు.35 నుండి 40 డిగ్రీల వరకు ఓమోస్తరు ఉష్ణోగ్రతలుగా గుర్తిస్తారు. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 42 నుండి 45 డిగ్రీల వరకు ప్రమాదకరంగా భావిస్తారు. అప్రమత్తత అవసరం. ఇక 45 డిగ్రీలు దాటితే దానిని అత్యంత ప్రమాదకరంగా హెచ్చరికలు జారీ చేస్తారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. బయటకు వెళ్లిన తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.