అక్రమాల టిఎస్ పిఎస్ సిని రద్దు చేయాలి  బీఎస్పీ  రాష్ట్ర  కార్యదర్శి  పుప్పాల లింబాద్రి

అక్రమాల టిఎస్ పిఎస్ సిని రద్దు చేయాలి  బీఎస్పీ  రాష్ట్ర  కార్యదర్శి  పుప్పాల లింబాద్రి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అక్రమాల టిఎస్ పిఎస్ సిని రద్దు చేయాలని బీఎస్పీ  రాష్ట్ర  కార్యదర్శి  పుప్పాల లింబాద్రి, జిల్లా ఇన్చార్జి మద్దెల నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపుమేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి , కమిటీ సభ్యులను బర్తరఫ్ చేసి కొత్త కమిటీ నియామకం చేయాలని డిమాండ్ చేస్తూ  బిఎస్ పి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేశారు. అనంతరం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా రాష్ట్ర  కార్యదర్శి  పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ గ్రూప్-1 రెండవ సారి కూడ రద్దు కావడానికి  కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలననే కారణం అన్నారు. ఆనాడే బీయస్పీ డిమాండ్ చేసినట్లుగా మొత్తం కమీషన్ని ప్రక్షాళన చేసి పరీక్షలను నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేదకాదన్నారు. నీళ్లు , నిధులు , నియామకాలు అంటూ సాగిన  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో  తెలంగాణ వస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడి ఉద్యోగాల కోసం 1300 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు జరిగాయన్నారు.   తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం 2014 నుండి నిరుద్యోగులు తొమ్మిది సంవత్సరాలు ఎదురు చూడగా వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలను చూసి సంతోషపడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిలిందన్నారు.  ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వం లోని పెద్దలే అమ్ముకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో జిరాక్స్ సెంటర్లలో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు దొరుకుతున్నాయని విమర్శించారు.  ఈ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి సంపత్ కుమార్, ధర్మపురి ఇన్చార్జి నక్క విజయ్, జిల్లా మహిళా కన్వీనర్ జాగర్ల రోజా రాణి, న్యాయవాది దీప,  జిల్లా మైనార్టీ కన్వీనర్ ముజ్జహీద్, నాయకులు రెడ్డి సతీష్ ప్రశాంత్, శ్రీధర్, నవీన్, వేణు, లక్ష్మణ్, భువన్, శేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.