'డబుల్​’ ఇండ్ల పథకం దేశంలో ఎక్కడా లేదు: కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం భారతదేశంలో ఎక్కడ లేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై సచివాలయంలోని  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో శుక్రవారం  జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో  మంత్రి కేటీఆర్ , మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో  ఒక్కోటి రూ.  50 లక్షల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదల కోసం ఉచితంగా అందిస్తున్నామన్నారు. హైదరాబాదులో  నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ రూ. 9100 కోట్లు  అని,  కానీ వాటి మార్కెట్ విలువ దాదాపు 50 వేల కోట్ల రూపాయల  పైనే ఉంటుందని చెప్పారు. 

మొదటి దశలో  11,700 వేల ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామని, ఈనెల 21వ తేదీన రెండవ దశలో  దాదాపు మరో 13,300 ఇండ్లను మరోసారి అందించనున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిగా  అధికారులకే అప్పగించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీసి  లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు.  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదే అని చెప్పారు.  తప్పు చేసిన అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని  మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.  నగరంలో గృహలక్ష్మి పథకం కూడా  త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.  హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని  కోరారని,  వారు సూచించిన మార్పులకు ముఖ్యమంత్రి  సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. మూసీ  పరీవాహక ప్రాంతంలో ఉన్న కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.