బడి బాటను విజయవంతం చేయాలి

బడి బాటను విజయవంతం చేయాలి
  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి
  • టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు.

ముద్ర, ముషీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3 నుండి 17 వరకు  నిర్వహించే జయశంకర్ బడి బాటను స్వాగతిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకోవటానికి ఉపాధ్యాయులు బడిబాటలో స్వచ్చందంగా పాల్గొనాలని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం  కె జంగయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంలో ఉపాధ్యాయులుగా తమవంతు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చి, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. మన ఊరు - మన బడి పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపజేసి సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు  నిర్వహించాలని, పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలన్నారు. నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలని, బకాయి ఉన్న మూడు డిఎలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు జెఎసి గా ఏర్పడి ఐక్య ఉద్యమానికి  సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె సోమశేఖర్, ఎ వెంకట్, ఎం రాజశేఖర్ రెడ్డి, వి శాంతకుమారి, జి నాగమణి, కె రవికుమార్, జి శ్రీధర్, ఎ సింహాచలం, వై జ్ఞాన మంజరి, ఎస్ కె మహబూబ్ అలీ, ఎస్ వై కొండలరావు తదితర జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.