నిబద్దతతో వ్యవహరించండి

నిబద్దతతో వ్యవహరించండి
  • దశలవారీగా సిబ్బందికి శిక్షణ ఇవ్వండి
  • ఓటరు జాబితాలో తప్పులు సవరించండి
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: ఎన్నికల అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టి  కేంద్రీకరించాలన్నారు. ఏ ఒక్క ఓటరు నుంచీ ఫిర్యాదులు రాకుండా పకడ్బందీగా పరిశీలన చేయాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను పునః సమీక్షించి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. 2018, 2019 ఎన్నికల సమయంలోని ఓటర్ల జాబితాతో సరిచూసి ప్రస్తుతం ఎక్కడైనా ఓటర్ల సంఖ్య తగ్గితే అందుకు గల కారణాలను అన్వేషించాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటింటికి తిరిగి పరిశీలన జరిపే ప్రక్రియను ఈనెల 23 నాటికి  పూర్తి చేయాలన్నారు. ఓటర్ల నమోదు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందేవారికి పోస్టల్ శాఖ ద్వారా ఓటరు గుర్తింపు కార్డు అందించే ప్రక్రియను కొనసాగించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని  సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సామాజిక మాద్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తి చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

21న రాష్ట్రానికి ఈసీ బృందం

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కేంద్ర ఈసీ బృందం రాష్ట్రానికి రానున్నది. ఈ నెల 21న రాష్ట్రంలో ఎన్నికల బృందం పర్యటిస్తుందని వికాస్ రాజ్​ వెల్లడించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన ఉంటుందని, ఎన్నికల ఏర్పాట్లు, ఈవీఎంలను పరిశీలిస్తారని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఈవీఎంలు, పోలింగ్​కేంద్రాలను కూడా సందర్శించే అవకాశం ఉందన్నారు.