బీఆర్ఎస్ కు ఇక వీఆర్ఎస్

బీఆర్ఎస్ కు ఇక వీఆర్ఎస్
  • రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే
  • బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్

కుత్బుల్లాపూర్, ముద్ర:తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బుధవారం రాత్రి ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 35 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేసున్నారన్నారు. మహిళలకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో సముచిత స్థానం లేదన్నారు. కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన పని చేస్తోందన్నారు. అందుకే అందరూ మోడీ వెంట నడుస్తున్నారన్నారు. ఒకప్పుడు ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు ఐదో స్థానంలో ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కేసీఆర్ ను రాష్ర్టంలో ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనన్నారు. అంతకు ముందు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 

25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

తమతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.