ప్రజా సంక్షేమం కోసం ఎన్ని అప్పులు ఉన్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం 

ప్రజా సంక్షేమం కోసం ఎన్ని అప్పులు ఉన్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం 
  • అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దే
  • గత ప్రభుత్వ హామీలు నీటి మూటలే 
  • నాలుగు నెలలకే అభివృద్ధి ఏదని మాట్లాడటం హాస్యాస్పదం
  • రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర,పానుగల్ :- ప్రజా సంక్షేమం కోసం ఎన్ని అప్పులు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీంటిని కచ్చితంగా నెరవేరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పానుగల్ మండల పరిధిలోని మల్లాయిపల్లి, చింతకుంట, దొండాయిపల్లి, దావాజిపల్లి,పానుగల్ గ్రామాలలో  ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పుల చిప్పను చేతికి ఇచ్చి నాలుగు నెలలకే అభివృద్ధి ఏదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది రూపాయల పనికి వంద రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రని అప్పుల పాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని, ప్రతి గ్యారెంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.ప్ర‌భుత్వం ఏర్ప‌డిన  48 గంట‌ల్లోనే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్ ప్ర‌యాణ స‌దుపాయం,  రాజీవ్ ఆరోగ్య‌శ్రీ రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంపు అమ‌లు చేసింద‌ని తెలిపారు.ఇప్ప‌టికే రూ. 500 కే వంట‌ గ్యాస్, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ను  అందిస్తున్నామ‌ని,ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కాన్ని కూడా ప్రారంభించామ‌ని చెప్పారు.కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి 3500 ఇండ్లు మంజూర‌య్యాయ‌ని, ల‌బ్ధిదారుల ఎంపిక  ప్ర‌క్రియ‌ను పార‌ద‌ర్శ‌కంగా చేప‌డ‌తామ‌ని,అర్హులైన ల‌బ్దిదారుల‌ను స్వ‌యంగా తానే ఎంపిక చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీ, పంట‌ల బీమా త్వరలో అమలు చేస్తామని,ఇప్ప‌టికే 5 ఎక‌రాల లోపు వ్య‌వ‌సాయ భూమి ఉన్న రైతుల‌కు రైతు భ‌రోసా ప‌థ‌కం ద్వారా పంట పెట్టుబ‌డి సాయాన్ని అంద‌జేస్తున్నామన్నారు.

గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి తప్ప ఎవరికీ లబ్ధి చేరలేదన్నారు. ఇంటికి పెద్ద కుటుంబానికి వ‌చ్చిన ఆస్తి కాపాడి త‌న పెద్ద‌రికాన్ని నిల‌బెట్టుకుంటాడ‌ని, కానీ  మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అలా వ్య‌వ‌హ‌రించ‌కుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చాడ‌ని అన్నారు.కాంగ్రెస్ పార్టీపై ఎంతో  న‌మ్మ‌కంతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  ఓట్లు వేశార‌ని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి ఓటు వేసి అత్య‌ధిక మెజార్టీతో  గెలిపించాల‌ని కోరారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ కు రుణపడి వున్నామని  అందుకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సోనియమ్మ రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి రవికుమార్, మాజీ సింగల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ సాగర్, పుల్లారావు, బ్రహ్మం, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.