బీ ఆర్ఎస్ లో టికెట్ల లొల్లి....

బీ ఆర్ఎస్ లో టికెట్ల లొల్లి....
  • ఆశావాహుల జోరు... గాడ్ ఫాదర్ తో పైరవీలు
  • అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
  • ఊపందుకుంటున్న టికెట్ల గోల

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ప్రయత్నాల జోరు కూడా  ఊపు అందుకుంటున్నది. ఇన్నాళ్లు పార్టీ లీడర్ ను క్యాడర్ను నమ్ముకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తమకు ఈసారి అసెంబ్లీ ఎన్నికలలోనైనా తప్పకుండా అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తుందని ఆశతో అధికార పార్టీలో ఆశావాహులు ఆశతో జోరు మీదున్నారు. తమకున్న పరిచయాలు ద్వారా  అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మంత్రి హరీష్ రావు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సుల కోసం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు .ఎప్పటికప్పుడు తమ తమ గాడ్ ఫాదర్ ల ద్వారా అధిష్టానానికి టచ్ లో ఉండి టికెట్ కోసం పైరవీలు జోరుగా చేస్తున్నారు గత పదిహేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసి ప్రజలతో నిత్యం టచ్ లో ఉన్నప్పటికీ కేవలం సెకండ్ క్యాడర్ గానే ముద్ర పడటం రాజకీయంగా పదోన్నతి లేకపోవడం తదితరుల కారణాలవల్ల మళ్లీ ఐదేళ్ల వరకు ఎన్నికలు రావ నే ఉద్దేశంతో ఈసారి ఎన్నికల్లోనే ఎట్లాగైనా టికెట్ సాధించాలని అధిష్టానంతో గాని తమ తమ అధినాయకులతో గాని అమితుమి తేల్చుకునేనా తిమ్మిని బమ్మిని చేసి అయినా  టికెట్ తెచ్చుకోవాలని తలంపుతో అధికార బి ఆర్ ఎస్ నాయకులు గత కొన్నాళ్లుగా తీవ్ర ప్రయత్నంలో ఉండి పావులు కదుపుతున్నారు . అలాగే నియోజకవర్గంలోని ఎంపీపీలు మండలపార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మండల స్థాయి కార్యవర్గం గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు గ్రామ శాఖ కార్యవర్గం జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇతర ముఖ్య నాయకులతో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తమ టికెట్ కోసం అధిష్టానంతో తమ గురించి మంచిగా చెప్పాలని తమ వెంట రావాలని స్థానిక నాయకులను కూడా ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్లు రాజకీయవర్గాల బోగట్ట. ఈ మేరకు ఎవరి ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే.

  • కోదాడకు నెలకొన్న తీవ్ర పోటీ

కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించేవారు నానాటికి ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన పలు సర్వేలలో ప్రస్తుత ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్ట మవుతున్నందున ఈసారి ఇక్కడ నుంచి సిట్టింగ్ మార్చి వేరొకరికి టికెట్ ఇస్తారని వదంతులు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా ఉన్న నియోజకవర్గ మాజీ ఇంచార్జి కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు మరికొంతమంది మండల పార్టీ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీ లను కలుపుకొని శశిధర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అలాగే ఒక వేళ లోక్సభ సభ్యుడు ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరితే ఉత్తం పద్మావతి రెడ్డి బీ ఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే యువకుడు రాజకీయ వారసత్వం ఉన్న సేవా తత్పరుడు రాజీవ్ ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్ఆర్ఐ చలసాని రాజీవ్ చౌదరి కూడా కోదాడ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సూర్యాపేట జెడ్పి చైర్ పర్సన్ దీపిక ఆమె భర్త గుజ్జా యుగంధర్ రావులు కూడా అధికార పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. ఇంకా బీసీ కోటాలో బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త గండూరి ప్రకాష్ జడ్పీ వైస్  చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ లు కూడా కోదాడ నుంచి టికెట్ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మరో ఎన్నారై జలగం సుధీర్ కోదాడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

  • తుంగతుర్తి నుంచి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే కే టికెట్  ఆని కేటీఆర్ ప్రకటించినా ఆగని పైరవీలు

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కి ఈసారి టికెట్ కేటాయిస్తామని 40 వేల మెజార్టీతో మూడోసారి గెలిపించాలని గత నెలలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ప్రకటించినప్పటికీ టికెట్ ఆశిస్తున్న వారి జోరు మాత్రం తగ్గలేదు. కిషోర్ కుమార్ కు  టికెట్ కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించగానే ఇన్నాళ్లుగా తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్నా మందుల  సామెల్ రాజీనామా చేశారు తుంగతుర్తి నియోజకవర్గంలో 62,000 మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని కానీ ప్రతిసారి మాలలకే టికెట్ కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ త్వరలో ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయనున్నారు అలాగే తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతురాజు రజిని ప్రస్తుత ఎమ్మెల్యే కిషోర్ కుమార్ పై  బాహాటంగానే అసమ్మతి జెండా ఎగరవేశారు. బీ ఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా ఉండటంతో పాటు తుంగతుర్తి టికెట్ రజిని ఆశిస్తున్నారు. అలాగే నాగారం జడ్పిటిసి కడియం పరమేశ్వరి ఇందిరా కూడా అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుత ఎమ్మెల్యే తీరుని ఎండగట్టారు. ఇంకా జాగృతి తరఫున  మేడే రాజీవ్ సాగర్ తుంగతుర్తి నుంచి టికెట్ ఆశిస్తున్నారు

  • హుజూర్నగర్ ఎమ్మెల్యే పై ఊపందుకున్న అసమ్మతి

హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీలు వ్యతిరేక గళం విప్పి ఆంధ్రాలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు అలాగే హుజూర్నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు గత కొన్నాళ్లుగా పట్టు పట్టడమే కాకుండా ఇటీవల అవిశ్వాసానికి తెర లేపడంతో అసమ్మతి వారిని ఎమ్మెల్యే బుజ్జగిస్తున్నప్పటికీ ఒక కొలిక్కి రాక హుజూర్నగర్ నియోజకవర్గ అంతా గందరగోళంగా ఉంది లోక్సభ సభ్యుడు టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరితే హుజూర్నగర్ నుంచి పోటీలో ఉంటాడని ఊహగానాలు ఊపందుకున్నాయి అలాగే నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న  పిల్లుట్ల రఘు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఎన్నారైలు పోశం నర్సిరెడ్డి అమర్నాథరెడ్డి కూడా హుజూర్నగర్ టికెట్ రేసులో ఉన్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ తుంగతుర్తి హుజూర్నగర్ నియోజకవర్గంలో అధికార బీ ఆర్ఎస్ నుండి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పలువురు సన్నద్ధమవుతున్నారు.