కూల్ గా...కల్తీ ఐస్ క్రీమ్ లు...

కూల్ గా...కల్తీ ఐస్ క్రీమ్ లు...
  • సిటీలో తయారీ.. పల్లెల్లో అమ్మకం
  • పట్టించుకోని అధికారులు
  • పోలీస్ లకు డబ్బులు ఇస్తున్నాం..
  • నిర్వాహకుడి సంచలన వ్యాఖ్యలు
  • "ముద్ర" కెమేరా కు చిక్కిన నాణ్యత లేని ఐస్ క్రీమ్ లు 

మెట్‌పల్లి ముద్ర :- ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా ఐస్ క్రీమ్స్ ని లైక్ చేస్తారు. పైగా ఇప్పుడు అసలే సమ్మర్. దీంతో ఐస్ క్రీమ్స్ కి మరింత డిమాండ్ పెరిగింది. మండుటెండల్లో చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. అయితే, ఐస్ క్రీమ్ లవర్స్ జాగ్రత్త పడాల్సిందే. పిల్లలు అడిగారు కదా అని వెంటనే ఐస్ క్రీమ్ కొనిచ్చారో ఇక అంతే సంగతులు. ఐస్ క్రీమ్.. ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే..కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు ఐస్ క్రీమ్ లను కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించరు. అపరిశుభ్ర వాతావరణం. హానికారక, ప్రమాదకర కెమికల్స్ వినియోగం. ఇదీ చాలా చోట్ల జరుగుతున్న తంతు. పైనేమో బ్రాండెడ్ ఐస్ క్రీమ్ కంపెనీ లేబుల్స్ ఉంటాయి. లోనేమో నాసిరకపు సరుకు ఉంటుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా కల్తీ చేసిన ఐస్ క్రీమ్స్ ను మార్కెట్ లో అమ్మేస్తున్నారు మోసగాళ్లు వివిధ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్న ఐస్ క్రీమ్ ల తయారీలో కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అక్రమార్జన కోసం వక్ర మార్గాలు పడుతున్నారు. గతంలో తెలంగాణలో పలు చోట్ల కల్తీ ఐస్ క్రీమ్ ల కలకలం రేగింది. పోలీసుల దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. అపరిశుభ్ర వాతావరణంలో విషపూరిత రసాయనాలు, హానికరమైన రంగులు కలిపి ఐస్ క్రీమ్ లు తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ కేంద్రాల పై హైదరాబాద్ నగరం లో పోలీసుల దాడులు నిర్వహించి నాణ్యత లేని ఐస్ క్రీమ్ కేంద్రాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఆ సంఘటనను మరువక ముందే మెట్‌పల్లి ప్రాంతంలో ఎలాంటి నాణ్యత, తయారు తేదీ లేని ఐస్ క్రీమ్ లు "ముద్ర" కెమేరాకు చిక్కాయి..

సిటీ లో తాయారు.. విలేజ్ లో అమ్మకం..

నాణ్యత లేని ఐస్ క్రీమ్ లు సిటీలో తయారు చేస్తూ విలేజ్ లలో విక్రయిస్తున్నారు. అయితే ఐస్ క్రీమ్ ల తయారీలో నాణ్యత ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. మెదక్ జిల్లా తుఫ్రాన్ కు చెందిన "తేజ" ఐస్ క్రీమ్ కంపెనీ  పట్టణంలో పలు చోట్ల ఐస్ క్రీం కేంద్రాలను ఏర్పాటు చేసుకొని కొంతమంది పనివాళ్ళ ద్వారా బండ్లు ఏర్పాటు చేసుకొని  మెట్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు  గ్రామాలలో ఐస్ క్రీమ్ లను విక్రయిస్తున్నారు. ఇలా విక్రయిస్తున్న ఐస్ క్రీమ్ లను "ముద్ర" రిపోర్టర్ పరిశీలించగా ఐస్ క్రీమ్ లు పలు రకాల కలర్స్ లలో నాణ్యత లేకుండా బూజు పట్టి, ఎలాంటి తయారి తేదీ లేకుండా కేవలం కంపెనీ పేరుతో దర్శనమిచ్చాయి. 

పోలీస్ లకు డబ్బులు ఇస్తున్నాం...

ఇలా నాణ్యత ప్రమాణాలు లేని ఐస్ క్రీమ్ లను పరిశీలించిన "ముద్ర" రిపోర్టర్ ఇలాంటి ఐస్ క్రీమ్ లు విక్రయించడం ద్వారా పిల్లలు అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యులు అని ఇవి విక్రయించడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారని సూపర్వైజర్ ను ప్రశ్నించగా పోలీస్ లకు, సంబంధిత అధికారులకు డబ్బులు ఇచ్చామని ఎవరు ఏమి చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చర్యలు తీసుకునేది ఎవరు...?

ఇలా పట్టణంలో పాటు పలు ప్రాంతాల్లో నాణ్యత లేని ఐస్ క్రీమ్ లు విచ్చల విడిగా విక్రయిస్తుంటే సంబంధిత అధికారులు మాత్రం ఈ ఐస్ క్రీమ్ తయారి దారులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేని ఐస్ క్రీమ్ లు విక్రయిస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే చర్యలు తీసుకునేది ఎవరు అని పలువురు ప్రశ్నిస్తున్నారు...