అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ

అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ
  • పురాణేతిహాసాల కాలం నుండి రాఖీ పండుగకు విశిష్టత
  • రాఖీ పండుగ విశిష్టత ,చరిత్ర

తుంగతుర్తి ముద్ర: అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు .అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ పూర్వకంగా సోదరి కట్టేది రాఖి .రాఖి అంటే రక్షాబంధన్ ఇది సోదర సోదరీమణులకు మహత్తరమైన పండుగ .శ్రావణ పూర్ణిమ రాఖీపూర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు . రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు గానీ పురాణేతిహాసాలలో మాత్రం రక్షాబంధన్ విషయంపై పలు కథలు ప్రచారంలో ఉన్నాయి .

ఇంద్రుడు వృథాసురుడిపై యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓటమి చెందే పరిస్థితి రావడంతో అప్పుడు భార్య అయిన సచిదేవి దేవి తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ మంత్రించిన దారాన్ని ఇంద్రుడి చేతికి కట్టడంతో ఇంద్రుడు రాక్షసులను ఓడించి విజయం సాధించాడని అలా రాఖీ పుట్టిందని చెప్తారు . అలాగే మహాభారతంలో కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ద్రౌపది శ్రీకృష్ణుడు అన్నా చెల్లెలు శిశుపాలుని శిక్షించే సమయంలో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలని పై ప్రయోగించే సమయంలో కృష్ణుడి చూపుడు వే వేలుకి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడ ఆ సమయంలో ఉన్న సత్యభామ, రుక్మిణీలు గాయానికి మందు కోసం పరిగెత్తగా అక్కడే ఉన్న శ్రీకృష్ణుడి చెల్లెలు ద్రౌపది వెంటనే తన చీర కొంగు చింపి కట్టు కడుతుంది. దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపదిని అవమానించిన సమయంలో శ్రీకృష్ణుని తన చెల్లెలు ద్రౌపదిని ఆదుకున్నాడు అనేది తెలిసింది .ఇలాగే మరో ఇతిహాస కథ ప్రచారంలో ఉంది .రాక్షస రాజు బలి చక్రవర్తి భూ మండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుండి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠం వదిలి వామనఅవతారంలో భూమి మీదకు వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతీ రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి వద్దకు వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున బలి చక్రవర్తి చేతికి పవిత్ర ధారాన్ని కట్టి తానెవరో నిజం చెబుతుంది .తన భర్తను ను ఎలాగైనా వైకుంఠానికి పంపాలని బలిచక్రవర్తిని కోరుతుంది .దీంతో బలి చక్రవర్తి తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు .ఆ విధంగా విష్ణుమూర్తిని బలి చక్రవర్తి వైకుంఠానికి పంపిస్తాడు. ఇవి పురాణ గాథలు కాగా మరోచరిత్ర కథ కూడా రాఖీ పౌర్ణమికి ఉదాహరణగా పేర్కొంటున్నారు .

అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరునిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వ విజేతగా నిలవాలని తపనతో గ్రీకు యువ రాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326 లో భారతదేశం పై దండెత్తుతాడు. ఆ క్రమంలో బ్యాక్టీరి యాన్ యువరాణి రోక్సనాను వివాహం ఆడాడు. ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా దేశాలు ముఖ్యంగా జీలం చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటించాడు .పురుషోత్తముడిపై దండెత్తి రావాలని అంబి ఆహ్వానించాడు . దీంతో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనతో యుద్ధానికి సిద్ధమవుతాడు .పురుషోత్తమునీ బలపరాక్రమాలు తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుతుంది .దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం చిక్కిన తన చేతికి రోక్సానా కట్టిన రాఖీ చూసి పురుషోత్తముడు విరమించుకున్నాడని ఇలా రాఖీ గొప్పతనం రాఖీతో అన్నాచెల్లెళ్ల బంధాన్ని వివరించే గాధలు ప్రచారంలో ఉన్నాయి .నాటి నుండి నేటి వరకు రాఖీ పండుగను గ్రామాల్లో పట్టణాల్లో ఆవాసాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇప్పటికే నగరాలు పట్టణాల నుండి గ్రామాలకు వచ్చే చెల్లెల్లు గ్రామాలు పట్టణాల నుండి నగరాలకు అన్నల వద్దకు వెళ్లే చెల్లెళ్లతోఆర్టీసీ బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి మరి కొంతమంది సొంత వాహనాలపై వారి అన్నల వద్దకు చేరుకుంటున్నారు రేపటి రక్షాబంధనం అద్వితీయం అనిర్వచనీయంగా కొనసాగనుంది.