ఈ నెల 21 నుండి 24 వరకు దుబ్బాకలో రేణుక ఎల్లమ్మ సిద్దోగం

ఈ నెల 21 నుండి 24 వరకు దుబ్బాకలో రేణుక ఎల్లమ్మ సిద్దోగం
  • అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు
  • కల్యాణోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన కౌండిన్య గౌడ సంఘం నేతలు
  • కళ్యాణం కోసం జోగేత్తుతున్న గౌడ సంఘ నాయకులు


సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో శాసనసభ నియోజకవర్గ  కేంద్రమైన దుబ్బాకలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సిద్ధోగము ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నది. రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు  కౌండిన్య గౌడ సంఘం నాయకులు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి కల్యాణోత్సవానికి హాజరుకావాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావును గౌడ సంఘం నాయకులు ఆహ్వానించారు.పట్టణములోని ప్రతి ఇంటి నుంచి అమ్మవారి కల్యాణానికి గౌడ సంఘం నాయకులు సంప్రదాయబద్ధంగా జోగేత్తుతున్నారు. అమ్మలగన్న అమ్మగా పేరుగాంచిన శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం దుబ్బాకలోని పెద్ద చికోడు రహదారిపై కొలువై ఉంది. ఆలయంలో అమ్మవారికి నిత్య పూజలు అభిషేకాలు అర్చనలు జరుగుతుంటాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి సిద్ధోగము నిర్వహిస్తారు. ఈ క్రతువులు భాగంగా అమ్మవారి కల్యాణోత్సవానికి దుబ్బాక పట్టణ కౌండిన్య గౌడ కుల సంఘం ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను, సిద్ధోగము, కళ్యాణోత్సవం, అన్నదానం నిర్వహిస్తున్నారు.

ఈనెల 21న ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, మధ్యాహ్నము 12 గంటలకు పట్టణము లోని పోచమ్మ బోనాల ఊరేగింపు, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 22న సోమవారం స్థాపిత దేవత పూజ 11గంటలకు పుట్టకు ద్వని పోయట, సాయంత్రం ఐదు గంటలకు ఎల్లమ్మ దేవి బోనాల ఊరేగింపు, రాత్రి 8 గంటలకు లలితా సహస్రనామ పారాయణము మహిళలతో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నెల 23న మంగళవారం ఉదయము పుట్ట బంగారం తేవడం, ఉదయం 11:45 నిమిషములకు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జమదగ్ని మహామునిల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరము భక్తజనులందరికి పెద్ద ఎత్తున అన్నదానమును ఏర్పాటు చేశారు. ఈనెల 24న పట్టణము లోని గౌడ సంఘ సభ్యుల ఇండ్లలో విందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలను పురోహితులు వేలేటి జయరామ శర్మ, రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని గౌడ సంఘం నేతలు తెలిపారు. కాగా అమ్మవారి కల్యాణోత్సవానికి హాజరుకావాలని దుబ్బాక శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు కు మంగళవారం రోజున గౌడ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కళ్యాణోత్సవ ఆహ్వాన పత్రికను వారు ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కౌండిన్య గౌడ సంఘం అధ్యక్షుడు అంబటి బాలేష్ గౌడ్, నేతలు శ్రీనివాస్ గౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, పల్లె కృష్ణమూర్తి గౌడ్, జగ్గారి వెంకటేష్ గౌడ్, ఏ.దుర్గాప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. ఎల్లమ్మ దేవి సిద్ధోగా మహోత్సవాలను జయప్రదం చేయాలని, ఇంటింటికి వెళ్లి ఆహ్వానిస్తూ, పూజా కార్యక్రమాలకు హితోదిక సహాయం అందించాలని గౌడ సంఘం నేతలు పట్టణంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ సంప్రదాయబద్ధంగా జోగుఎత్తే కార్యక్రమాన్ని మంగళవారం నుంచి పట్టణంలో ప్రారంభించారు.