ప్రభుత్వ విద్యను విస్మరిస్తున్న పాలకులు పీ.డీ.ఎస్.యు

ప్రభుత్వ విద్యను విస్మరిస్తున్న పాలకులు పీ.డీ.ఎస్.యు
rulers ignore govt education

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని టీ ఎన్ జి ఓ భవనంలో పీ.డీ.ఎస్.యు జోగులాంబ గద్వాల జిల్లా జనరల్ కౌన్సిల్ సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభకు పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి. శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ. ప్రస్తుత సమాజంలో ఉన్నవారికి ఒక చదువు లేని వారికి మరో చదువు అనే రీతిలో ప్రభుత్వ విధానాలు ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యా విధానం కోసం విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరికి సమాన విద్య అందించే విధానాలు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయకుండా ఎస్సీ ఎస్టీలు, బీసీలు చదివే విద్యాసంస్థలను అర్థం పర్థం లేని కారణాలతో మూసివేశారు. దళిత గిరిజనులకు చదువులు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ చదువులను రిలయన్స్ టాటా బిర్లా చేతికి పగ్గాలు అప్పగిస్తున్నారని వీటిని విద్యార్థులు తిప్పికొట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలు ప్రతి సంవత్సరం వాటికి నిధులు తగ్గిస్తూ వస్తుందన్నారు.

పీహెచ్డీ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్లను కూడా తగ్గించి వారికి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కెసిఆర్ విద్యార్థి నిరుద్యోగులను నిలువెల్ల మోసం చేస్తున్నాడు.అదిగో నోటిఫికేషన్లు-ఇదిగో ఉద్యోగాలు అంటూ రాష్ట్రంలో ఏదో మూలన ఎన్నికలు వచ్చినప్పుడల్ల ఖాళీల లెక్కలు తీయాలనీ అధికారులను ఆదేశిస్తున్నాడు.ఎన్నికలు ముగిసిన తర్వాత" ఏరుదాటేదాకా ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న "అనే సామెత గా వ్యవహరిస్తున్నాడు.

తెలంగాణ తొలి అసెంబ్లీలో లక్షా 25 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని తక్షణమే భర్తీ చేస్తానన్న కేసీఆర్  కాలంలో 50వేలు కూడా భర్తీ చేయలేదు. మన తెలంగాణలో మనకు కావలసినంత స్కాలర్షిప్, ప్లీజ్ రియంబర్స్మెంట్ తీసుకుందామనీ ఉద్యమ సమయంలో మాట్లాడిన కేసీఆర్ నేడు పేద విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాలు పెండింగ్లో పెట్టిండు. నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే" ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా" వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల్లో గెలుపే పరమావధిగా భావించి అడిగిన వాటిని పక్కకు పెడుతూ అడగను వాటిని సంక్షేమ పథకాల రూపంలో ప్రవేశపెట్టి మిగులు బడ్జెట్ గా వున్న తెలంగాణను లక్షల కోట్ల అప్పులోకి నెట్టి ఇ అప్పుల కుంపటిలా మార్చాడు. విద్యార్థులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.