ముమ్మాటికి ఇది కక్ష సాధింపే... ఐజేయూ ఖండన

ముమ్మాటికి ఇది కక్ష సాధింపే... ఐజేయూ ఖండన
IJU- Indian Journalists Union

హైదరాబాద్, చండీగఢ్: ఢిల్లీ ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయం పన్నుల శాఖ అధికారులు జరిపిన దాడులను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ తీవ్రంగా ఖండించింది. సర్వే పేరుతో జరిపిన ఈ దాడులను ఐజేయూ అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము ఒక ప్రకటనలో ఖండిస్తూ, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ప్రభుత్వం ఈ దాడులకు పాల్పడుతోందని విమర్శించారు.

Also Read: IT Raids In BBC Offices Delhi బీబీసీలో ఐటీ సోదాలు

పాలనా వ్యవహారాల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పులను విమర్శించిన వారిపై ప్రభుత్వ ఏజెన్సీల చేత దాడులు జరిపిస్తూ బెదిరింపులకు పాల్పడటం సాధారణమైపోయిందని వారు వ్యాఖ్యానించారు. గుజరాత్ లో 2002లో జరిగిన మతకలహాలపై బీబీసీ డాక్యుమెంటరీని విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ ఏజెన్సీని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడటం శోచనీయమని వారు విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గల ఒక వార్తా సంస్థ పై ఇటువంటి దాడులు చేయడం అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్టను దిగజార్చుతుందని వారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇకనైనా మీడియా సంస్థలపై దాడులకు స్వస్తి చెప్పాలని వారు హితవు పలికారు. 

ఇది అసహనానికి నిదర్శనం

న్యూఢిల్లీ: సర్వేల పేరుతో బీబీసీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన కొద్ది వారాలలోపే ఇటువంటి దాడులు జరగడం కక్ష సాధింపు చర్య మాత్రమేనని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఉమాకాంత్ లఖేరా, సెక్రటరీ జనరల్ వినయ్ కుమార్ విమర్శించారు.