సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్యలు- సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి

సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్యలు-  సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి

సిద్దిపేట ముద్ర ప్రతినిధి: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఏ రకమైన సైబర్ నేరాలు  జరుగుతున్నాయో వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని, వారు అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేస్తామన్నారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరాలు చేస్తు ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెబుతూ అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్  నేరం చేస్తున్నారని తెలిపారు. ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరానికి పాల్పడుతున్నారని సిపి పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగు తున్నందున అదే అదునుగా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి  బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా  దోచేస్తున్నందు వల్ల ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని తెలిపారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తున్నారని అందువల్ల  ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. మన బ్యాంకు డీటెయిల్, మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పవద్దు ఎవరితో షేర్ చేసుకోవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఫోన్ లేప వద్దని, వారు పెట్టే మెసేజ్ లకు, మెయిల్స్ ఓపెన్ చేయవద్దని సూచించారు .సైబర్ విషయంలో మనం అప్రమత్తంగా ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరని , ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చూస్తామని సిద్దిపేట సిపి శ్వేతా రెడ్డి తెలిపారు.