సెంటిమెంట్ తో సక్సెస్ !

సెంటిమెంట్ తో సక్సెస్ !
  • అంబాసిడర్ కారులో వెళ్లి నామినేషన్                                                      
  • స్పీకర్ పోచారం నకు కలిసి వచ్చిన 7007 నెంబర్                                                          

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : పాత అంబాసిడర్ కారు ఆయనకు కలిసొచ్చింది...ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలు గల అనేక కార్లు మార్కెట్ లోకి వచ్చినా... 7007 నెంబర్ గల ఆ అంబాసిడర్  కారులోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేయడానికి వెళ్తారు. 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు తల్లి పాపమ్మ ఆశీర్వదం తీసుకొని, 1994 నాటి అంబాసిడర్ కారులో ఇంటి నుంచి ఎన్నికల అధికారి కార్యాలయానికి అంబాసిడర్ కారులో వెళ్లారు.  తల్లి గత మూడేళ్ల క్రితం పరమ పాదించారు. 

ప్రత్యర్థి ఎంతటి వాడైనా... ఓడించే సత్తా తనకు ఉందని... తన గెలుపులో తన ఆంబాసిడర్ కారు... కన్న తల్లి ఆశీర్వాం... నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆశీర్వాదం చాలు... గెలిచి తీరుతానని నమ్ముతారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.   ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థానానికి ఏడు సార్లు పోటీ చేయగా, ఆరు సార్లు ఈ సెంటిమెంట్తోనే విజయం సాధించారు. ఆయన తొలిసారిగా 1994లో టిడిపి తరపున బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంలో నామినేషన్ దాఖలుకు అంబాసిడర్ కారు (ఎటిజె-7007)ను ఉపయోగించారు.  1984లో లక్కీ డ్రాలో తన కూతురు పేర ఈ కారును పొందారు. కన్న తల్లి పరిగె పాపమ్మ ఆశీర్వాదం పొంది నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిని మీనాదేవిపై 57,472 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 1998లో మంత్రిగా ఆవకాశం లభించింది. కొత్త కారును కొన్నారు. కానీ తన పాత కారును మర్చిపోలేదు. ఆ కారును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో ఉంచారు. దీన్ని కేవలం నామినేషన్ వేయడానికి వెళ్లే సందర్భంలోనే ఉపయోగిస్తారు. 1999లో జరిగిన ఎన్నికల్లో తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ కారులోనే తహసీ ల్దార్ కార్యాలయానికి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కిషన్ సింగ్ పై విజయం సాధించారు. 1998లో, ఆ తర్వాత1999లో చంద్రబాబునాయుడు కేటినెట్లో  మంత్రిగా పని చేశారు. భూగర్భ గనుల శాఖా మంత్రిగా పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. 2009లో ఈ సాంప్రదాయాన్నే పాటించి, అంబాసిడర్ కారులో వెళ్ళి నామినేషన్ వేయగా, బాజిరెడ్డి గోవర్ధన్ పై 26వేల ఓట్లతో గెలుపొందారు.

 2011లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోచారం, తన ప్రత్యర్ధి శ్రీనివాస్ గౌడ్ పై 49వేల ఓట్లతో గెలుపొందడం గమనార్హం. 2014లోనూ అమ్మ ఆశీర్వాదం పొంది, అంబాసిడర్ కారులో వెళ్ళి నామినేషన్ వేయగా, భారీ మెజారిటీతో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కాసుల బాలరాజ్ పై 18వేల ఓట్లతో  గెలుపొందారు. నియోజకవర్గాన్ని రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశారు.  ప్రస్తుతం 2023లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం తన దశాబ్దాల కాలం నాటి అంబాసిడర్ కారులో వెళ్లి  నామినేషన్ దాఖలు చేశారు.
 
కాగా ఈ పాత కారు నెంబర్ 7007 తనకు కలిసి వచ్చిందనే ఉద్దేశ్యంతో ఆయన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కొత్త కొత్త మాడల్ కార్లన్నీటికి నెంబర్లు 7007 సీరీస్ లోనే తీసుకున్నారు. ఆయన తనయులు సైతం 7007 నెంబర్లతోనే కార్లను కొనుగోలు చేస్తున్నారు.