ముగిసిన అసెంబ్లీ | Mudra News

ముగిసిన అసెంబ్లీ | Mudra News
  • శాసనమండలి కూడా వాయిదా
  • వారం రోజులు సాగిన బడ్జెట్ సమావేశాలు
  • తక్కువ రోజులని  మండిపడిన విపక్ష నేతలు 
  • జవాబు చెప్పలేక సర్కారు పారిపోయిందని విమర్శ


ముద్ర, తెలంగాణ బ్యూరో:  
వారం రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ  సమావేశాలు ఆదివారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. ద్రవ్య మినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 56.25 గంటల పాటు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగాయి. ఈ నెల మూడున గర్నవర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. ఈ నెల ఆరున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభ చర్చించింది. పలు బిల్లులు, తీర్మానాలపై చర్చ సాగింది. చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. బస్తీ దవాఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై సమాధానాలు ఇచ్చారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. 

విపక్షాల ఆగ్రహం
అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయడంపై విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ జీవిత కాలంలో ఇంత తక్కువ రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం చూడలేదన్నారు. విపక్ష సభ్యులు ప్రజా సమస్యలపై నిలదీయడంతోనే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయారని కాంగ్రెస్​ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా పరిష్కరించాలని తాము కోరుతున్నామని అన్నారు.  ప్రజా సమస్యలు వినే ఓపిక లేకనే అధికార పార్టీ పారిపోయిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో విపక్ష సభ్యుల గొంతు నొక్కుతున్నా, తమను అవహేళన చేస్తున్నా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాలని తాము భావించినా అధికారపార్టీ అడ్డుకుందని, ప్రజా క్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడుతామని భట్టి తెలిపారు. తన 20 యేళ్ల రాజకీయ జీవితంలో ఇంత తక్కువ కాలం బడ్జెట్​ సమావేశాలు తాను చూడలేదని బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్​ అన్నారు. ప్రజా సమస్యలు వినే ఓపిక పాలకులకు లేదన్నారు. అసెంబ్లీని సైతం బీఆర్ఎస్​ రాజకీయాల కోసం వాడుకున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని దూషించారని అన్నారు. అందుకే అసెంబ్లీ నిర్వహించారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండలి సైతం 
తెలంగాణ శాసనమండలి సైతం నిరవధికంగా వాయిదా పడింది. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సమాధానం ఇచ్చిన అనంతరం సభను నివధికంగా వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి ప్రకటించారు.