సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం -మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట-సిరిసిల్లా  రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం -మంత్రి హరీశ్ రావు
  • రూ.500  కోట్లు కేటాయింపు 
  • టెండర్ ప్రక్రియ పూర్తి -మంత్రి హరీశ్ రావు  వెల్లడి

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి : సిద్దిపేట-సిరిసిల్ల రైల్వే లైన్ పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. ఈ రైల్వేలైన్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలకు కేటాయించారని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వారం రోజుల్లో పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు గురువారం నాడు సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రైల్వే లైన్ నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  పంద్రాగస్టులోపు (60 రోజులలో )సిద్ధిపేటలో రైలు ట్రయల్ రన్ ఉంటుందని హరీష్ రావు చెప్పారు. రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తారని చెప్పారు.

హన్మకొండ- మిట్టపల్లి రహదారి పై రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులు ఎప్పటిలోపు పూర్తి చేస్తారని అధికారులను ఆరా తీశారు.ఎల్కతుర్తి-మెదక్ నేషనల్ హైవే-జాతీయ రహదారి నాలుగు లేన్ల రహదారి నిర్మాణం వస్తున్న దృష్ట్యా, రవాణా యధావిధిగా జరిగేలా సైడ్ లేన్ తీసుకుని ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించాలని రైల్వే అధికారులను ఆదేశించారు.సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వేట్రాక్ లైను పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు.

 తెల్లవారుజామునే మంత్రి మందపల్లి నుంచి దుద్దడ వరకు జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను చకచకా పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు,సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.