స్తూపం వద్ద అమరులకు ఘన నివాళి హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు

స్తూపం వద్ద అమరులకు ఘన నివాళి హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు

కేసముద్రం, ముద్ర : ఎట్టకేలకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి నాయకులు గురువారం తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అమరవీరుల స్థూపాలను అందంగా ముస్తాబు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోవడం జరుగుతుంది. అయితే నెల్లికుదురు మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపాన్ని నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ‘అమరవీరుల స్థూపం వైపు కన్నెత్తి చూసేవారేరి' అనే శీర్షికతో ముద్రలో ప్రచురించిన వార్తా కథనానికి గ్రామ సర్పంచ్ యాదగిరి రెడ్డి స్పందించి రెండు రోజుల క్రితం అమరవీరుల స్థూపానికి ప్రత్యేకంగా రంగులు వేయించారు.

బుధవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సతీమణి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, ఎంపీడీవో శేషాద్రి, స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి, బీఅర్ఎస్ మండల బారాస అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్, తొర్రూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కసరబోయిన విజయ్ తదితరులు హాజరై అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలుంచి ఘనంగా నివాళులర్పించారు. ఇట్టకేలకు అధికారులు ప్రజాప్రతినిధులు బారాస నాయకులు అమరవీరుల స్థూపాన్ని రంగులేసి ముస్తాబు చేసి, అమరవీరులను స్మరించుకోవడం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.