చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం - కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం  - కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  ఓ వ్యక్తికి ఆకస్మికంగా వచ్చిన గుండెపోటును గుర్తించి సీపీఆర్ చేసి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడిన ఘటన కళ్ళ ముందు కదలాడుతుండగానే మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళ ప్రాణాలను నిలబెట్టాడు.. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో ఓ మహిళ దూకి ఆత్మహత్య యత్నం చేసింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ క్షణం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకి ఈదుకుంటూ వెళ్లి మహిళను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళ బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన లలితగా గుర్తించారు. భర్తతో గొడవపడి చెరువు వద్దకు వచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహిళను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.