అగ్నికి అవుతయిన మున్సిపల్ పొడి చెత్త సేకరణ కేంద్రం

అగ్నికి అవుతయిన మున్సిపల్ పొడి చెత్త సేకరణ కేంద్రం

(డి ఆర్ సి సి లో అగ్ని ప్రమాదం )

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేటలో మునిసిపాలిటీకి చెందిన డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డిఆర్సిసి) ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయింది. స్థానిక కోమటి చెరువు కట్ట కింద హౌసింగ్ బోర్డ్ వెళ్లే బైపాస్ దారిలో సిద్దిపేట మున్సిపాలిటీకి పొడి చెత్తను కలెక్షన్ చేసి రిసోర్స్ సెంటర్ కు పంపించే భారీ షెడ్ ఉంది. ఈ డ్రై రిసోర్స్ కలెక్షన్  సెంటర్ లో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి షెడ్డులో మూడు పోర్షన్లు, డీసీఎం కాలిపోయాయి. మున్సిపాలిటీ ద్వారా సేకరించే పొడి చెత్త ను ఇక్కడ  నుంచి రిసోర్స్ కు పంపడానికి డీసీఎం లో లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు.

 ప్రమాదం జరిగిన వెంటనే మున్సిపల్ వాటర్ ట్యాంకర్ లతోపాటు, స్థానిక ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మంటలు చాలాసేపు అదుపులోకి రాలేదు. ఎట్టకేలకు రాత్రి వరకు మంటలను అదుపులోకి వచ్చాయి. పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నష్టం వివరాలు అంచనా వేయగలమని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు, సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి, మున్సిపల్ అధికారులు,కౌన్సిలర్లు సందర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.