ఉద్యమ నాయకుడికి అభయ'హస్తం'

ఉద్యమ నాయకుడికి అభయ'హస్తం'

- పొన్నం ప్రభాకర్ కు కలిసి వస్తున్న బీసీ నినాదం 
- ప్రచారంలో దూసుకెళ్తున్న వైనం..
- మద్దతు పలుకుతున్న సబ్బండ వర్గాలు
- పార్లమెంట్ లో పొన్నం పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్న జనం 

చిగురుమామిడి ముద్ర న్యూస్: హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నం ప్రభాకర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయనకు పార్టీ కల్పించిన బీసీ నినాదం ఈసారి ఎన్నికల్లో కలిసివచ్చే అవకాశం గా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిన సమయంలో పార్లమెంటులో ఆయన పోరాడిన తీరు ఇప్పటికీ జనం గుండెల్లో గుర్తుండిపోతోంది. ఆయనపై జరిగిన పెప్పర్ స్ప్రే దాడిని ఇక్కడి జనాలు గుర్తు చేసుకుంటున్నారు.నియోజకవర్గ ప్రజలకు వెన్నుదన్నుగా తాను ఉంటానంటూ పొన్నం ప్రభాకర్ ప్రచారంలో భాగంగా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ముందుకు కదులుతున్నారు. బీసీ నాయకుడు కావడం.. అందులోనూ  హుస్నాబాద్ నియోజకవర్గానికి సుపరిచితుడు కావడంతో ఆయనకు విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ముమ్మరంగా గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం బీసీలే ఉండడం పొన్నం కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అన్ని వర్గాల చూపు పొన్నంపై పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియను ముగించుకున్న ఆయన.. ప్రతిరోజు నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. గ్రామ గ్రామాన పార్టీ హామీలను వివరిస్తున్నారు. 

 అభివృద్ధిలోనూ ముందుండే నాయకుడు.. 

2009 ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్ ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు సందర్భంగా ఎంపీలందరూ తమ గలాన్ని వినిపించారు. అయితే ఇందులో కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ ముందు వరసలో నిలిచారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గం కూడా కరీంనగర్ పరిధిలోనే ఉండడంతో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పాటు ఆయన ఎప్పుడూ క్యాడర్ ను  అంటిపెట్టుకునే ఉన్నారు. అప్పటి నాయకులతో ఉన్న పరిచయాలు.. పార్టీ కార్యకర్తల శ్రమ కలిస్తే పొన్నం అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రచారంలో కూడా జనం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.