జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని  తాకట్టు పెడితే గుణపాఠం చెబుతాం - టీయుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ

జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని  తాకట్టు పెడితే గుణపాఠం చెబుతాం - టీయుడబ్ల్యుజె ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ
TWJ General Secretary Virahat Ali

నారాయణఖేడ్, ముద్ర న్యూస్: స్వప్రయోజనాల కోసం జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ హెచ్చరించారు. పదవుల కోసం రకరకాల వేషాలు కట్టుకొని జర్నలిస్టులను మోసగిస్తున్న ఆ శక్తులకు ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జర్నలిస్టులు తగిన బుద్ది చెప్పారని ఆయన అన్నారు. బుధవారం నాడు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు, సంగారెడ్డి, ఆందోల్, నారాయణ ఖేడ్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి, నారాయణ ఖేడ్ పట్టణంలోని బాబా ఫంక్షన్ హాలులో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడారు. అరవై ఏండ్ల వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తుందన్నారు.

తమ పోరాటాల ఫలితంగానే గ్రామీణ విలేఖరులకు అక్రెడిటేషన్లు, ప్రెస్ అకాడమీ, ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు సాధించుకోగలిగినట్లు విరాహత్ స్పష్టం చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం పట్ల ఎలాంటి అవగాహన లేని కొన్ని శక్తులు చోటా మోటా దుకాణాలు పెట్టుకొని పబ్బం గడపడం సిగ్గుచేటన్నారు. మెతుకుసీమ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఓ ప్రజాప్రతినిధి జర్నలిస్టుల వ్యవహారాల్లో తలదూర్చడం సహించారనిదన్నారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో విరాహత్ అలీ వెంట రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, విష్ణుకుమార్, సీనియర్ నాయకులు మిన్పూర్ శ్రీనివాస్, భూమయ్య, వెంకట్ రెడ్డి, రాజేందర్, నందు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనీల్, ఆసీఫ్, దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడు బాసిత్, జిల్లా నాయకులు యాదగిరి, వెంకటేష్, అలీం, జీవన్ తదితరులు ఉన్నారు.

ఆందోల్ లో ఘన స్వాగతం

 బుధవారం నాడు సంగారెడ్డి జిల్లా పర్యటించిన టీయుడబ్ల్యుజె నేత విరాహత్ అలీకి ఆందోల్ నియోజకవర్గ జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జోగిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. ఇస్నాపూర్ లో పటాన్ చెరువు నియోజకవర్గ జర్నలిస్టులు, కంది లో సంగారెడ్డి నియోజకవర్గ జర్నలిస్టులు విరాహత్ కు ఘన స్వాగతం పలికారు. నారాయణ్ ఖేడ్ లో వందమంది జర్నలిస్టులతో కలిసి బైక్ పై ర్యాలీగా సభా స్థలికి చేరుకున్నారు.