సైబర్ నేరాల పై అవగాహన అవసరం

సైబర్ నేరాల పై అవగాహన అవసరం
  • గ్రామాల్లో అవగాహనా సదస్సులు
  • నిర్మల్ డీ ఎస్పీ గంగారెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:సైబర్ నేరాల బారిన పడి పలువురు నష్టపోతున్నారని నిర్మల్ డీ ఎస్పీ గంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ మొబైళ్లకు వచ్చే లింకులు తెరవకూడదని అన్నారు. అప్రమత్తతతో అధికశాతం నేరాలు అదుపు చేయవచ్చని వివరించారు. అలాగే వాణిజ్య సముదాయాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే అది వారికి,ప్రజలకు శ్రేయస్కరమని అన్నారు. ఇందుకోసం ' నేను సైతం ' కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పెరిగిపోతున్న కారణంగా తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇందులో అత్యధికం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జరిగాయన్నారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో సామాజిక మాధ్యమాల్లో ఆయా గ్రూపుల అడ్మిన్ లపై కూడా చర్యలుంటాయన్నారు. ఎలాంటి ఇబ్బందీ ఎదురైనా 100 కు ఫోన్ చేయాలని సూచించారు. పోలీసులు అందరికీ అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తున్నందున భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ పురుషోత్తమా చారి, రూరల్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, ఎస్సై సుమలత పాల్గొన్నారు.