బచ్చన్నపేట ఎస్సైని సస్పెండ్ చేయాలి

బచ్చన్నపేట ఎస్సైని సస్పెండ్ చేయాలి

సిపిఎం మండల కార్యదర్శి డిమాండ్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: అధికార పార్టీ  నాయకుడికి సహకరిస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్న బచ్చన్నపేట ఎస్సైని సస్పెండ్ చేయాలని చిల్పూర్ సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుడు గిరబోయిన అంజయ్య భూ అక్రమాలకు, భూకబ్జాలకు పాల్పడుతుంటే అతనికి సహకరిస్తూ  ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, రామగల్ల అశోక్, మినులపురం ఎల్లయ్య, కంత్రి ఐలయ్య, నరసింహులుపై అక్రమంగా బైండోవర్ కేసు బనాయించి భూకబ్జాదారుల ఎస్సై కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు.

బచ్చన్నపేట మండలం చిన్న రామచంద్రం గ్రామ పరిధిలో  174 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని  గత ఏడాది ప్రభుత్వ స్థలమని బోర్డు పెట్టిన అధికార పార్టీకి చెందిన అంజయ్య కుటుంబం సాగుచేస్తూ అక్రమాలకు పాల్పడుతుంటే అట్టి భూమిని స్వాధీనం చేసుకొని ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పార్టీ మండల కమిటీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా కోట్ల విలువ చేసే భూమి కొల్లగొట్టే ప్రయత్నంలో అధికార పార్టీ నాయకుడు ఉన్నాడు. దానికి ఎస్ఐ నవీన్ కుమార్ సహకరిస్తూ భూమి పోరాటం చేస్తున్న నాయకులను ప్రజలను బెదిరిస్తున్నారు. శుక్రవారం రోజు మధ్యాహ్నం తమ లీడర్లను జనగామ ఏసీపీ తమ  మాట్లాడతారని పిలిపించుకొని, అక్కడ వెళ్లిన తర్వాత బలవంతంగా తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లి బైండ్ వర్ కేసు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి కేసులకు సీపీఎం భయపడేది లేదని ఆ భూమి పేదల దక్కింతవరకు పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఊరడి రవి, ఊరడి మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు.