అంతర్‌‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

అంతర్‌‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌
  • 10 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.40 వేల నగదు స్వాధీనం
  •  ప్రజలు అలర్ట్‌ గా ఉండాలి
  • వెస్ట్‌ జోన్‌ డీసీపీ సీతారాం

ముద్ర ప్రతినిధి, జనగామ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌‌ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు వెస్ట్‌ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దేవేందర్‌‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌ తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి20న  జిల్లా కేంద్రంలోని వాసవీ కాలనీలో తాళం వేసిన ఉన్న ఇంట్లో జరిగిన చోరీపై బాధితుడు శివగారి కిరణ్‌కుమార్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు ఫైల్‌ చేసి దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు శుక్రవారం పట్టణంలో అనుమానంగా తిరుగుతున్న సిద్దిపేట జిల్లా రాఘాపూర్‌‌కు చెందిన మణిగండ్ల విజయ్‌కుమార్‌‌, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన సామాను శివ, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన లక్కమల్ల రవిని అదుపులోకి తీసుకున్నారని విచారించారు.  దీంతో వారు దొంగతనం విషయం ఒప్పుకున్నారని డీసీపీ చెప్పారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన ఏసీపీ దేవేందర్‌‌రెడ్డి, క్రైం ఏసీపీ రాజు, సీఐ శ్రీనివాస్‌ యాదవ్‌, ఎస్సైలు రఘుపతి, జీనత్‌, రుక్మాచారి, సీసీఎస్‌ టీం సభ్యులను డీసీపీ అభినందించారు. వీరికి రివార్డు అందించనున్నట్లు తెలిపారు.

జల్సాలతోనో దొంగతనాలు...
ఈ కేసులో దొరికిన విజయ్‌కుమార్‌‌, శివ, రవి జల్సాల కోసమే దొంగతనాలు చేసేవారని డీసీపీ వెల్లడించారు. విజయ్‌కుమార్‌‌ ఇప్పటి దాదాపు 75 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో బషీర్‌‌బాగ్‌ పీఎస్‌లో 30 కేసులు, జీడిమెట్లలో 15, వనస్థలిపురంలో 7, జడ్చర్లలో 10,  ఖమ్మం జిల్లాలో 13 కేసుల్లో నిందితిడుగా ఉన్నాడని వివరించారు. గతంలో ఇతడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్‌ చేసి మహబూబ్‌నగర్‌‌ జైలుకు పంపించగా పీటీ వారెంట్‌పై నల్లగొండ జైలుకు వచ్చినట్లు తెలిపారు. అయితే ఇక్కడ ఉన్న సమయంలోనే విజయ్‌కుమార్‌‌కు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన సామాను శివ, లక్కమల్ల రవి పరిచయం అయ్యారని చెప్పారు. బైలుపై బయటకు వచ్చిన ఈ ముగ్గురు తమ ప్రవర్తణ మార్చుకోకుండా తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించారని వివరించారు. ఈ క్రమంలో పట్టణంలో వాసవీ కాలనీలో కూడా తాళం వేసిన ఇంటిని టార్గెట్‌ చేసి చోరీకి పాల్పడ్డారని తెలిపారు.


అలర్ట్‌ గా ఉండాలి..
ఎండాకాలం చోరీలు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని, ప్రజలు అలర్ట్ గా ఉండాలపి డీసీపీ సీతారాం సూచించారు. చాలా మంది ఎండాకాలం ఇంటికి తాళాలు వేసే బిల్డింగ్‌ల పైన, ఆరుబయట నిద్రిస్తారని ఆ సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజా రక్షణ కోసమే పోలీసు శాఖ ఉందని, కానీ జనం కూడా తమకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.