కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి – బీఆర్‌‌ఎస్‌ జిల్లా ఇంచార్జి కోటిరెడ్డి

కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి – బీఆర్‌‌ఎస్‌ జిల్లా ఇంచార్జి కోటిరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: బీఆర్‌‌ఎస్‌ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని మూడో సారి అధికారంలోకి తేవాలని ఆ పార్టీ జనగామ జిల్లా కార్యక్రమాల సమన్వయ కమీటి ఇంచార్జి,  ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం.సీ కోటిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన ఆయన మంగళవారం జనగామకు వచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్, జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలోని 12 మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ స్థానిక లీడర్లు ప్రకటిస్తారని చెప్పారు. వచ్చే నెల 25వ తేదీ వరకు అన్నీ గ్రామాల్లో సమ్మేళనాలు పూర్తి చేసి, 27న బీఆర్‌‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని పథకాలు మన తెలంగాణలో సీఎం కేసీఆర్‌‌ ప్రవేశపెట్టాడని తెలిపారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ఈ పథకాలను ఆపాలని చూస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో మన ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితను ఈడీ పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఈడీ, మోడీలకు తాము భయపడేది లేదని రాబోయే రోజుల్లో కేంద్రంలో బీఆర్‌‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే రాజయ్య బల ప్రదర్శన..


సమావేశానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ ఘన్‌ పూర్‌‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జిల్లా ఇన్‌చార్జి ముందు తన బలప్రదర్శన చూపేందుకు ప్రయత్నం చేశారు. ఆయన ప్రసంగం ఆధ్యంతం తాన నియోజకవర్గ ఓటర్లు, వారికి అందిస్తున్న పథకాలు, ఆత్మీయ సమ్మేళనం ప్లానింగ్‌ తదితర విషయాలను వివరించారు. ఎమ్మెల్యే ప్రసంగం ఆధ్యంతం కార్యకర్తలు చప్పట్ల మోతలు మోగించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవేలి కృష్ణరెడ్డి, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు రమణారెడ్డి, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు చిట్ల జయశ్రీ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, కొమురవెల్లి మాజీ చైర్మన్ సంపత్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్ మేకల రాంప్రసాద్, మున్సిపల్‌ ఫ్లోర్‌‌ లీడర్‌‌ మారబోయిన పాండు, కౌన్సిలర్లు బండ పద్మ యాదగిరిరెడ్డి, ఎండీ సమద్, టీఆర్‌‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్‌రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి సుల్తాన్‌ రాజ్‌, జిల్లాలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.