నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
  • మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  • అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- గురుకుల పాఠశాల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన చిన్నలచ్చి ప్రశాంత్ (12) భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడని, ఈ నెల 11న ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆస్పత్రిలో  వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ నెల 17 న మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.

నిరుపేదలు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరగడం పేదలను విద్యారంగానికి దూరం చేయడమే అవుతుందని మండిపడ్డారు. విద్యార్థులు అస్వస్థకు గురైన రోజు నుండి గుట్టుచప్పుడు కాకుండా అధికారులు చికిత్స చేయించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం తోనే ప్రశాంత్ మృతి చెందాడని వారిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు వెంకటేష్, కుక్క బిక్షపతి, సుక్క బాబు, బాలయ్య ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.