తెలంగాణ పోలీసులను దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్​దే

తెలంగాణ పోలీసులను దేశంలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్​దే

మహిళా సురక్షా సంబరాలలో హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ
ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని షీటీమ్స్​ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ట్యాంక్​బండ్​పై మహిళా సురక్షా సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మహిళా కమిషన్​ చైర్మన్​ సునీతా లక్ష్మారెడ్డి, మేయర్​ గద్వాల విజయలక్ష్మి, ఉమెన్​ సేఫ్టీవింగ్, షీటీమ్స్​ ఇన్​చార్జీ షికాగోయల్​, హీరో నాని, క్రీడాకారిని నైనాజైస్వాల్ లు హాజరయ్యారు. తెలంగాణ పోలీస్​విమెన్​ సేఫ్టీవింగ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్​ను అతిథులతో కలసి కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్​ అలీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్​ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్​ నంబర్​వన్​ స్థానంలో ఉన్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్​ కంట్రోల్​ను మన దగ్గర సీఎం కేసీఆర్​ ఏర్పాటు చేశారన్నారు. గతంలో మహిళలు అర్థరాత్రి రోడ్లపై తిరగాలంటే భయపడేవారని, ఇప్పుడా భయంలేదని నిర్భయంగా తిరుగుతున్నారని చెప్పారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించి పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, దీంతో నేరాలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పారు. డీజీపీ అంజనీకుమార్​తో పాటు ముగ్గురు కమిషనర్లు చాలా చక్కడా లా అండ్​ ఆర్డర్​ కొనసాగిస్తున్నారని ప్రశంశించారు.

సీఎం కేసీఆర్​ పోలీస్​ శాఖపై ప్రత్యేక శ్రద్ద చూపడంతో పాటు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చాని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే తెలంగాణ పోలీస్​ నంబర్​వన్​ స్థానంలో ఉండబోతుందని చెప్పారు. మహిళల కోసం షీటీమ్స్​, భరోసా కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు.  మంత్రి సత్యవతి రాథోడ్​ మాట్లాడుతూ దశాబ్ధి ఉత్సవాలో రెండవరోజు పోలీసు ఉత్సవాలు నిర్వహించుకోవడం అంటే ముఖ్యమంత్రికి పోలీసుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల ఎలాంటి చర్యలు చేపడుతుందో కళ్లకు కట్టినట్లు ఈ కార్యక్రమం ద్వారా వివరించడం శుభపరిణామమన్నారు. భారత దేశానికి ఆదర్శంగా మన పోలీసు వ్యవస్థ ఉండటం మనకు గర్వకారనమన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళా భద్రత కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలిగిస్తుందన్నారు.

ఆడపడుచుల సంక్షేమం, భద్రతపై సీఎం కేసీఆర్​ ప్రత్యేక శ్రద్ద వహించి షీటీమ్స్​, భరోసా తదితర కార్యక్రమాలను తీసుకువచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే రౌడీరాజ్యం నక్సలైట్ల రాజ్యం అవుతుందని అపోహలు ఉండేవవన్నారు. నాటి డీజీపీ అనురాగ్​ శర్మ, మహేందర్​రెడ్డి, ఇప్పుడు డీజీపీ అంజనీకుమార్ వరకు ఒక్క రోజు కర్ఫూలేకుండా, కమ్యూనల్​ రైడ్​ లేకుండా రికార్డు పరిపాలన సాగిస్తున్నారు. ఎవరినీ ఎక్కడ వేధించకుండా చాలా చక్కటి లాఅండ్​ ఆర్డర్​ అందిస్తున్నారు మహిళలకు భద్రత ఇస్తున్నారు  కాబట్టే మనకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా యావత్​ తెలంగాణ ప్రజానికం తరపున పోలీసులకు వందనాలు తెలియజేశారు. ఇక్కడ మనకు కనబడుతున్న పోలీసులు మూడు సింహాలైతే మనకు కనబడకుండా వారి వెనుక ఉండి నడిపించే నాలుగో సింహం కేసీఆర్​అన్నారు. మహిళా కమిషన్​ చైర్మన్​ సునీతాలక్ష్మారెడ్డి, సినీ హీరో నాని, క్రీడాకారిని నైనా జైస్వాల్, మేయర్​ గద్వాల విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హోంసెక్రటరీ మహేష్​ భగవత్, పోలీస్​ కమిషనర్ సి.వి.ఆనంద్ తదితర పోలీస్​ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.