ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ...

ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహణ...
  • జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి డి. కల్పన


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన సంబంధిత అధికారులతో మంగళవారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమీక్షించారు.

ఈ సందర్భంగా  జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన మాట్లాడుతూ  ఇంటర్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మూడు విడతలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా 32 జనరల్, 16 ఒకేషనల్ ప్రాక్టికల్ కేంద్రాలలో మూడు విడతలుగా ప్రయోగ పరీక్షలు నిర్వహించ బడతాయని, దీనికి అవసరమైన వసతులు, పరికరాలు, సీసీ కెమెరా, తాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రయోగ పరీక్షల్లో సైన్స్ విద్యార్థులు 2698,  ఒకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 1093, రెండవ సంవత్సర విద్యార్థులు 1036 మంది పరీక్షలకు హాజరు కానున్నారని అన్నారు. 

మొదటి విడత ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు, రెండో విడత 6వ తేదీ నుండి పదవ తేదీ వరకు, మూడో విడత 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతాయన్నారు.ప్రయోగ పరీక్షల తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు, 17వ తేదీన పాత విద్యార్థులకు నైతికత మానవ విలువల పరీక్ష ,  ఫిబ్రవరి 19వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, అలాగే కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ను తప్పనిసరిగా విద్యార్థులకు అందజేయాలని లేనిచో తగిన చర్యలు తీసుకోబడతాయని  తెలిపారు.
ఈ సమావేశంలో కళాశాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.