తెలంగాణ  చైత‌న్యానికి, పోరాటానికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

తెలంగాణ  చైత‌న్యానికి, పోరాటానికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల టౌన్, ముద్ర:తెలంగాణ బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి చాక‌లి ఐల‌మ్మ ప్ర‌తీక అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి  అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ లో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాక‌లి ఐల‌మ్మ జయంతి వేడుకలు జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, టిఎస్పిటిడిసి చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య, ఆర్డీఓ లు, ఆనంద్ కుమార్, మధు సూదన్, జిల్లా రజక సంఘాల నాయకులు వీరనారి చాక‌లి ఐల‌మ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి  మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు. నాటి కాలంలోనే, తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, రజక సంఘాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.