సీతారాముల కల్యాణానికి ఈసీ గ్రీన్​ సిగ్నల్​

 సీతారాముల కల్యాణానికి ఈసీ గ్రీన్​ సిగ్నల్​
  • ప్రత్యక్ష ప్రసారానికి ఓకే!
  • రెండుసార్లు ప్రభుత్వం లేఖ రాయడంతో స్పందించిన ఈసీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ వేడుకకు ముందుగా అనుమతి నిరాకరించిన ఈసీ.. ఇటు ప్రభుత్వం, అటు విపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, విమర్శలతో ఎట్టకేలకు అనుమతి ఇస్తున్నట్లు అత్యవసర సమాచారం ఇచ్చింది. దీంతో కోట్లాది భక్తులకు ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పినట్లైంది. ప్రతీ ఏడాది కనులపండువగా వైభవంగా జరిగే ఈ వేడుకలను కోట్లాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేవారు. ఈసారి ఎన్నికల కోడ్ కారణంగా ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి లేదని ఈసీ మూడు రోజుల కిందట వెల్లడించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే అనుమతి వస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుమానించినట్టుగానే వేడుకలకు ముందు రోజు అంటే మంగళవారం సాయంత్రం ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దంటూ ప్రభుత్వానికి సూచించింది. 

మరోసారి ప్రభుత్వం లేఖ..

ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఎలాగైనా ఈ ప్రత్యక్ష ప్రసారాల విషయంలో భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది.  భద్రాద్రి క్షేత్ర ప్రాముఖ్యత, కల్యాణ వేడుక దృష్ట్యా శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో వివరించింది. ముందుగా చేసిన అభ్యర్థనను ఏప్రిల్ 4వ తేదీనే ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా మళ్లీ ప్రయత్నం చేసింది. తమ ప్రభుత్వ అభ్యర్థనను పున: పరిశీలించాలని ఈసీకి మరో లేఖ రాసింది. నేరుగా వైకుంఠం నుంచి వచ్చి కొలువు దీరిన చతుర్భుజ రామునిగా దక్షిణ భారత దేశంలో అపూర్వమైనదిగా కొలిచే భద్రాద్రి రాముని వేడుకలు అత్యంత ప్రాధాన్యమైనవని ఈసీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని కోరింది. 1987 నుంచి ప్రత్యక్ష ప్రసారం ఆనవాయితీగా వస్తోందని, 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ లైవ్ ఇచ్చిందని, రేడియో ద్వారా కళ్యాణ మహోత్సవ వ్యాఖ్యానం ప్రసారమైందని ప్రభుత్వం ఈ లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కోట్లాది భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని ఈసీని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఈసీ ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.