బయోమెట్రిక్ పద్దతితో రైతుల ధాన్యం కొనుగోలు : జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ.భాస్కరరావు

బయోమెట్రిక్ పద్దతితో రైతుల ధాన్యం కొనుగోలు : జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ.భాస్కరరావు

ముద్ర ప్రతినిధి భువనగిరి:బయోమెట్రిక్ పద్దతి ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇందుకోసం గ్రామాలలో రైతులకు తెలిసేలా విస్త్రృత ప్రచారం చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ.భాస్కరరావు ఐకెపి, మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వానాకాలం ఖరీఫ్ 2023 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై ఎపిఎంలు, ట్యాబ్ ఆపరేటర్లకు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు, మార్కెటింగ్ రీసోర్స్ పర్సన్లకు, ఐకెపి సభ్యులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టరు రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు, కేంద్రాల నిర్వహణపై వివరించారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తూకం, తేమ యంత్రాలు, టెంట్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, ట్యాబ్ ఎంట్రీకి కావలసిన ఇంటర్నెట్, తదితర వసతులు ఏర్పరచుకున్న తర్వాతనే కేంద్రాలను ప్రారంభించాలని, ముఖ్యంగా హమాలీలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గతంలో ఓటీపి ప్రక్రియ ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ముఖ్యంగా ఈసారి రైతుల నుండి బయోమెట్రిక్ పద్దతి ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయడం జరుగుతుందని, బయోమెట్రిక్ పద్ధతి గురించి రైతులకు తెలిసేలా గ్రామాలలో విస్త్రృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. కొనుగోళ్లు పూర్తి కాగానే ట్యాబ్ ఎంట్రీ చేసి సకాలంలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీరియల్ ప్రకారం రైతుల నుండి కొనుగోలు చేయాలని, వ్యవసాయ అధికారుల సహకారంతో ధాన్యం నాణ్యతపై రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. ప్రతి రోజూ బయోమెట్రిక్, డేటా కలెక్షన్, రైతుల ఖాతాలలో ఎంత డబ్బు జమ అయిన వివరాలతో కూడిన డైలీ రిపోర్టు సకాలంలో పంపాలని, కొనుగోళ్ల ప్రక్రియపై తరచూ టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తామని, ఐకెపి, మార్కెటింగ్, వ్యవసాయ అధికారుల సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియను సాఫీగా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.శిక్షణా కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు గోపీకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, అడిషనల్ డిఆర్డిఎ జోజప్ప,  డిపిఎం. సునీల్, రవాణా శాఖ అధికారి పాల్గొన్నారు.