గంగుల ది మూడో స్థానమే

గంగుల ది మూడో స్థానమే
  • అక్రమ దందాలు చేసిన వారికి బుద్ధి చెప్పండి
  • మీరిచ్చిన ధైర్యంతోనే కేసీఆర్ ను ఢీ కొట్టిన
  • ఓట్ల కోసం ఒవైసీ దగ్గర మోకరిల్లిన గంగుల
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అధికార బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ మూడవ స్థానానికి పరిమితం కాబోతున్నాడని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోంది. అంగ, అర్ధ బలం లేకున్నా, రాజకీయ వారసత్వం లేకపోయినా మీరిచ్చిన ధైర్యం, ఎంపీ పదవితోనే సీఎం కేసీఆర్ ను ఢీ కొట్టిన అని అన్నారు. శుక్రవారం కరీంనగర్ నియోజకవర్గ ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన, ప్రగతి భవన్ కే పరిమితైనోడిని ప్రజల్లోకి లాక్కొచ్చిన అన్నారు. కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసిన కరీంనగర్ ప్రజలంతా గల్లా ఎగరేసుకుని తిరిగేలా చేసిన అసెంబ్లీ అభ్యర్ధిగా మళ్లీ మీ ముందుకొచ్చిన మళ్లీ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా అంటూ కరీంనగర్ ప్రజలకు విజ్ఝప్తి చేశారు. భూకబ్జాలు, అక్రమ దందాలు చేస్తూ అవినీతికి పాల్పడేటోళ్లకు బుద్దిచెప్పాలని కోరారు. ‘‘రబ్బర్ చెప్పులు, జీన్స్ ప్యాంట్ యువకులారా మీ దమ్ము చూపే సమయం వచ్చింది. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేవాళ్లను తరిమేయండి అంటూ పిలుపునిచ్చారు.


నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలవగానే బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోతాడని కేసీఆర్ కు అర్ధమైంది. ఇక్కడున్న బీఆర్ఎస్ అభ్యర్ధిని మార్చాలని ఉద్దేశంతోనే 5 రోజులపాటు బి.ఫాం కూడా ఇవ్వకుండా ఆపారు. వందలకోట్లు ఖర్చు చేస్తానని చెప్పడంతో విధిలేక ఆయనకే టిక్కెట్ ఇచ్చిండని వెల్లడించారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో బీఆర్ఎస్ ది మూడో స్థానమేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నరంటే పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. నేను రాష్ట్రమంతా తిరిగి కొట్లాడుతుంటే కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధితో రాజీ పడ్డానని నాపై కొందరు దుష్ప్రచారం చేశారు. రాజీపడటం నాకు చేతకాదు కేసీఆర్ పైనే రాజీలేని పోరాటం చేస్తున్న ఇక్కడ రాజీపడతానా అంటూ చెప్పుకొచ్చారు. నేను పోటీ చేస్తున్నట్లు తెలియగానే బీఆర్ఎస్ అభ్యర్థి ఓట్ల కోసం దారుస్సలాం పోయి ఒవైసీ కాళ్లు పట్టి కరీంనగర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు అన్నారు. గతంలో టీడీపీ నుండి గెలిచి బీఆర్ఎస్ లోకి పోయిండు. ఆ తరువాత బీఆర్ఎస్ నుండి గెలవగానే పచ్చ జెండాతో ర్యాలీ తీసిండు. ఇప్పుడేమో ఓట్ల కోసం దారుస్సలాం పోయి ఒవైసీకి సలాం చేస్తుండు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


నేను ఓడినా, గెలిచినా కాషాయ జెండాను వదల్లేదు. మీరిచ్చిన ధైర్యం, అండతో కాషాయ జెండాను ముద్దాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం, పేదల కోసం పోరాడుతున్న. కరీంనగర్ ఆత్మగౌరవ పతాకాన్ని దేశమంతా ఎగరేసిన. మీరు ఎక్కడికి వెళ్లినా కరీంనగర్ వాసులమని కాలరెగరేసి చెప్పుకునేలా చేసిన. తెలంగాణలో ఎంఐఎంను లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టుపెట్టిన నేతలకు బుద్ది చెప్పాలని కోరుతున్నా. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది అని స్పష్టం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగులు, లక్షలాది మంది రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులంతా బిజెపి విజయం కోసం ఎదురుచూస్తున్నరు అని పేర్కొన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి కాషాయ జెండా ఎగరవెయ్యాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, గుగ్గిళ్ళపు రమేష్, దూబాల శ్రీనివాస్ తోపాటు పలువు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.